Articles on Ramsha

ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభోవీధిపై నంతైన రాంషా జీవన పథం

parentsరాంషా గారు జన్మించినది 1924 జూలై 30వ తేదీన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పక్కన వేట్లపాలెంలో. తల్లితండ్రులు శ్రీమతి వేంకటరత్నం, దర్భా వేంకటరమణయ్య గార్లు పెట్టిన పేరు వేంకట రామశాస్త్రి. ఆయన ఏకైక తోబుట్టువు అక్కగారు కీ.శే. శ్రీమతి రుక్మిణీ పేరమాంబ గారు.

పుట్టటం ఐశ్వర్యంలోనే పుట్టినా ఆ తరువాత కుటుంబ పరిస్థితుల వల్ల రామశాస్త్రి గారి జీవితం విద్యాభ్యాసం మొదలుకొని మధ్య వయస్సు దాకా పేదరికంలోనూ, సమస్యల ముళ్ళబాటలోనూ గడిచింది. తల్లిప్రేమకు లేత వయసులోనే దూరమై పెదతల్లి పెంపకంలో అనాదరణ అనుభవించాల్సి వచ్చింది. దానితో చిన్నవయసులోనే గ్రంధ పఠనాన్ని ఆశ్రయించడం జరిగింది. అంతర్ముఖత, ఒంటరితనం ఆ రోజుల్లోనే అలవడ్డాయి.

రాంషాగారి విద్యాభ్యాసం  స్కూలు ఫైనల్ వరకూ సామర్లకోటలోనూ, ఎఫ్.ఎ. కాకినాడ పి.ఆర్. కళాశాలలోనూ జరిగింది. జన్మజాత సంస్కారానికి ఆచార్యుల శిక్షణ తోడుకాగా రాంషాగారి ప్రతిభా విశేషాలు విద్యార్థి దశలోనే గుబాళించాయి. వృత్తికి అంకితులు, పువ్వు మొగ్గై ఉండగానే పరిమళాన్ని పసిగట్టే నిష్ణాతులూ అయిన అధ్యాపకులు ఎక్కువగా ఉన్న రోజులవి. శాస్త్రిగారిలో అంతర్లీనమై ఉన్న ప్రతిభని గుర్తించి ప్రత్యేక శ్రద్ధతో దానిని వెలికి తీసి మెరుగు పెట్టిన ఘనత వారిదే. ఆ రోజుల్లో నిడదవోలు వెంకట్రావుగారు “విఙ్ఞానానికి పరాకాష్ఠగా విలసిల్లాలని” ‘రాంషా’ (రామ్ శాహ్) అని పేరు పెట్టారు. ఆయన వాక్కు పొల్లు పోలేదు. ఆ రాంషాయే నాటినుంచి కొన్ని తరాలపాటు ఆంధ్రుల గుండెల్లో నిలిచే పేరయిందని వెంకట్రావు గారికి తెలుసో లేదో?

ramsha

విద్యార్థిదశలోనే శ్రీ రాంషా సాహిత్య రంగంలో ప్రవేశించడం, అనతికాలంలోనే అఖండ ప్రఖ్యాతి సంపాదించుకుని ఉద్దండులు, లబ్థ ప్రతిష్ఠులు అయిన పండితుల సరసన సన్మానం పొందే అదృష్టం పొందడం జరిగాయి. 24 సంవత్సరాలు నిండే సరికల్లా ముమ్మరంగా కవితలూ, కావ్యాలూ, గేయాలూ, కథలూ, విమర్శనాత్మక వ్యాసాలూ రాంషాగారి కలం నుంచి వెలువడి, ఆయనకు ఖ్యాతి తెచ్చి పెట్టాయి. ఆ కీర్తిప్రతిష్ఠలే ఆయనకు బరంపురం నుంచీ కావలి దాకా విశేష సన్మానాలు ఆర్జించాయి.

Poetic Trio - somasundar Avamtsa, Shashanka (Voleti Subbarao), Ramsha Darbha

1944 నుంచి 1955 వరకూ శ్రీ రాంషా, శ్రీ సోమసుందర్ తో కలిసి కమ్యూనిస్ట్ ఉద్యమాలలో ప్రముఖ పాత్ర వహించారు. ఆ రోజుల్లో రాంషా, సోమసుందర్, శశాంక గార్లు ప్రాణస్నేహితులు. మార్క్స్ రచనలు రాంషాగారిని బాగా ప్రభావితం చేశాయి. భారతదేశంలోని ఆర్థిక వ్యవస్థల గురించి మార్క్స్ వ్యాఖ్యానిస్తూ అప్పటికి వ్యాప్తంలో ఉన్న బ్రాహ్మణ ఆర్థిక వ్యవస్థ ఔన్నత్యాన్ని మార్క్స్ ప్రశంశించిన సంగతి పదే పదే చెబుతూ ఉండేవారు. నిజంగా మార్క్స్ సిద్దాంతాలు చాలా గొప్పవనీ, సమాజ శ్రేయస్సుకి దోహదం చేసేవనీ, కానీ నేడు మార్క్సిస్టులమని చెప్పుకునే వారిలో చాలా మందికి నిజంగా మార్క్సిజం గురించి అవగాహనే లేదనీ అందుకే మార్క్సిజం భారతదేశంలో అభాసు పాలైందనీ అంటుండేవారు.

ఈ దశాబ్దంలోనే రాంషాగారికి కవిగా, కథకుడిగా, విమర్శకుడిగా, నటుడిగా, నాటక రచయితగా, న్యాయ నిర్ణేతగా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ‘శిలాప్రతిమ’ ఆయన తొలి నాటిక. ‘లక్షింపతిగారి అమ్మాయిలు’ అనే నాటకానికి అప్పట్లో ఎంతో మంచి పేరు వచ్చింది. కామేశ్వరి కథ (నవల), మనస్తత్వాలు, మీనాక్షి ముద్దు, ప్రియురాలు, పెళ్ళి తిరకాసు, మొండిచెయ్యి, చెత్తకథ, ప్రేమపక్షులు మొదలైన కథల సంపుటులు ఖ్యాతినార్జించాయి. ముఖ్యంగా కామేశ్వరి కథ వేలాది కాపీలు అమ్ముడై విశేషంగా ప్రజాదరణ పొందింది.

1948లో 24వ యేట రాంషాగార్కి తొలి సన్మానం విశాఖ జిల్లా చోడవరంలో అఖిలాంధ్ర సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో జరిగింది. ఆ సభలో సర్వశ్రీ డా|| చిలుకూరి నారాయణరావు, వేదుల సత్యనారాయణ శాస్త్రి, వఝ్జుల కాళిదాసు, మల్లాది సూర్యనారాయణ శాస్త్రి, పిలకా గణపతి శాస్త్రి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

‘కుళ్ళు సరుకు’ నాటకంలో ఆయనకు ఆంధ్ర నాటక కళా పరిషత్ ఉత్తమ బహుమతి లభించింది.

1948లో పెళ్ళయి శ్రీమతి శిరీష, రాంషాగారి జీవితాన్ని పంచుకోనారంభించారు. కొద్దిపాటి పొలంనుంచీ వచ్చే ధాన్యపు గింజలూ, ఆ పత్రికకీ, ఈ పత్రికకీ వ్యాసాలు, గేయాలు, కథలు రాయగా వచ్చిన పారితోషికాలే ఆ రోజుల్లో రాంషాగారి భుక్తి.

కాలక్రమేణా సంసార బాధ్యతల వల్ల సంపాదనావసరాలు పెరిగి ఉద్యోగాన్వేషణలో పడ్డారు. కమ్యూనిష్టు ఉద్యమంలోంచి విరమించుకున్నారు. చిన్నాచితకా ఉద్యోగాలలో పత్రికాఫీసుల్లోనూ, సామర్లకోట షుగర్ ఫాక్టరీలోనూ.. ఇంకా అక్కడక్కడ పనిచేసి ఎక్కడా ఇమడలేక వదిలి పెట్టేశారు. అప్పటికి ఆయనకి ధనికొండ హనుమంతరావు గారితో మంచి స్నేహం వుంది. ఆయన ‘జ్యోతి’, ‘అభిసారిక’ మొదలగు పత్రికల వ్యవస్థాపకుడు. సునిశిత మేధోశక్తి సంపన్నుడు. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సాహచర్యం రాంషా గారిని బాగా ప్రభావితం చేసింది. సాహిత్యరంగంలో రాంషాగారి గురువు శ్రీ వేదుల సత్యనారాయణ శాస్త్రిగారు కాగా జీవనరంగంలో శ్రీ ధనికొండ అయ్యారు. శ్రీ ధనికొండ సారథ్యంలో వెలువడుతున్న ‘అభిసారిక’కి వైజ్ఞానిక వ్యాసాలు రాస్తుండేవారు అప్పట్లో రాంషా.

ఇదిలా ఉండగా వైరుధ్యాలతో, అవకాశ వాదులతో నిండిపోతున్న కమ్యూనిష్టులతో విసిగి వీరి వల్ల ఎవరికీ ప్రయోజనం లేదని భావించి 1957 ప్రాంతాల్లో రాంషాగారు జీవనోపాధికై ధర్మచక్ర పవర్ ప్రెస్స్ స్థాపించడం జరిగింది. ఇంతకీ ప్రెస్స్ పెట్టినా దానికి తగ్గ పని దొరకలేదు. ఆ ప్రెస్స్ లో అచ్చు వేయించుకున్నవారు మళ్లీ ప్రెస్స్ ఛాయలకి వచ్చేవారు కాదట. దాంతో హతాశులై మార్గం లేక తనే పుస్తకాలు వ్రాసి తనే అచ్చువేసుకుని అమ్ముకోవటం మొదలు పెట్టారు. ధనికొండవారు ‘అభిసారిక’ను అప్పటికే తెనాలి నుంచీ మద్రాసు చేరవేసి కొంతకాలం నడిపి ఆపివేయటం జరిగింది. ఆ స్థితిలో 1960లో మద్రాస్ వెళ్లిన రాంషాగారిని ‘అభిసారిక’ నిర్వహణను చేపట్టమని శ్రీ ధనికొండ సూచించటం – ఆనాటి నుంచీ రాంషా గారు, సహధర్మచారిణి శ్రీమతి శిరీష చేదోడువాదోడుతో అభిసారికను కంటికి పాపలా చూసుకొంటూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, నిర్విరామ  కృషితో, రక్తం ధారపోసి ముప్ఫయి ఏళ్ళపాటు నిర్వహించి ఉన్నత స్థాయికి తీసుకు రావటం జరిగింది.

Ramsha Siriesha at Dharmachakra Power Press

విధి నిర్వహణలో, జీవితంలో ఆయన ఓర్చిన కష్టాలన్నింటిలోనూ శ్రీమతి శిరీష ఆయనకు తోడుగా నిలిచి, అభిసారిక, రాంషాగారు కీర్తి శిఖరాలను అధిరోహించటంలో శ్లాఘనీయ పాత్ర వహించారు.

రాంషా గారి నిర్వహణలో ‘అభిసారిక’ కీర్తి ఉన్నత శిఖరాలు అధిరోహించింది. అభిసారికని అభివృద్ధి చేయటానికి తన జీవితమంతా ధారపోశారు రాంషా. 1960 నుంచీ, 1990 వరకూ 30 సంవత్సరాల పాటు లక్షలమంది పాఠకులకు అన్నయై, తండ్రియై, తాతయై, మిత్రుడై వారి వారి సమస్యలకు యథోచిత పరిష్కారాలు సూచిస్తూ, వారి మోములపై చిరునవ్వు దీపింప జేసారు. అందుకే ‘అభిసారిక – రాంషా శిరీష’ల పేర్లు విడదీయరానివి. ఏ పేరు చెప్పినా రెండో పేరు స్ఫురణకు రావలసినదే.

ఆ 30 సం||ల అభిసారిక నిర్వహణలోనూ మానసిక వత్తిడులూ, ఆర్థిక సమస్యలూ రాంషా గారిని ఎన్నోసార్లు క్రుంగదీసాయి. 1974 ప్రాంతాలకి పత్రిక ఆగిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది. అయినా పట్టువీడని ధృఢ సంకల్పం, ఆప్తుల సహాయ సహకారాలు, శిరీషగారి తోడు, ప్రోత్సాహమూ కలిసి రాగా, విధి నిర్వహణలో రాంషాగారు ముందుకెడుతూనే వచ్చారు. నిలదొక్కుకొని అభిసారిక నిరాటంకంగా దిగ్విజయంగా సాగుతూ వచ్చింది. ఆ 30 ఏళ్ళలో – ముఖ్యంగా తొలి సంవత్సరాలలో అభిసారిక ద్వారా రాంషా గారు సాధించిన విజయాలు చెప్పుకోదగ్గవి – గర్భస్రావం చట్టబద్ధం చేయాలని, వివాహయుక్త వయస్సుని 18 కే పరిమితం చేయాలని, 21కి పెంచకూడదని, సెక్స్ ఎడ్యుకేషన్ హైస్కూల్ స్థాయిలో ప్రవేశపెట్టాలనీ – ఇత్యాది సంస్కరణలు.

అభిసారికలో ‘అడగండి-చెబుతాను’ శీర్షిక ఎంతో ఆదరణ పొందింది. పాఠకుల వ్యక్తిగత, లైంగిక సమస్యలకు రాంషాగారు  హేతుబద్ధంగా, వైద్య, ధర్మ, మనోవిజ్ఞాన శాస్త్రాల పరంగా ఇచ్చే సమాధానాలు పాఠకుల నెంతో ఆకట్టుకోవటమే కాక వారి సందేహాలకి, సమస్యలకి సాకల్యమైన, సంపూర్ణమైన పరిష్కారాలు లభించటంతో పాఠక హృదయాలలో రాంషాగారికి అద్వితీయ స్థానం లభించింది.

వేలాదిమంది సంతానవంతులయ్యారు. లక్షల పాఠకుల సంసారాలలో జ్యోతులు వెలిగాయి. ఆయన సమాధానాల్లో లభించే ఆదరణ, ఆప్యాయత, మందలింపు, వాటిల్లో కనిపించే తర్కం, ఆయన విషయాన్ని విరిచి, విడమరచి ఉపమానాలతో చెప్పే విశిష్ఠ శైలి – పత్రికకూ, రాంషా గారికీ ఎంతో  పేరు తెచ్చిపెట్టాయి. అందుకే రాంషాగారు ఎందరికో అన్నగా, తండ్రిగా, తాతగా, ఆత్మీయుడిగా నిలిచి పోయారు. ఎడిటర్‌ పాఠకుల సాన్నిహిత్యం అభిసారికలో ఉన్నంతగా మరే పత్రికలోనూ లేదు.

‘అడగండి-చెబుతాను’ శీర్షికతో పాటు ఎన్నో సెక్సువిజ్ఞాన వ్యాసాలు, ధర్మశాస్త్రాల వ్యాఖ్యానాలూ, సామాజిక సమస్యలకు సంబంధించిన శీర్షికలూ, ప్రయోజనాత్మకమైన ఇతివృత్తాలు గల కథలూ అన్నిటితోనూ అభిసారిక జనరంజకమై, విజ్ఞానదాయకమై తెలుగు మాసపత్రికల్లో ద్వితీయ స్థానాన్ని చేరుకుంది.

ఎన్నో వేల జీవితాల్లో ఆనంద జ్యోతులు వెలిగించిన రాంషాగారి దాంపత్య జీవితాన్ని అంధకారమయం చేస్తూ శ్రీమతి శిరీష 1982 సెప్టెంబరులో తన 47వ యేట గుండెజబ్బుతో కాలంచేసారు. అంతకు 4 నెలల ముందే రాంషాగారికి గుండెపోటు వచ్చి నెలరోజులు హాస్పిటల్లో ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉండవలసి వచ్చింది. అప్పటికి రాంషాగారి వయసు 58. ఇక రిటైరవవలసిన సమయం.

కాని శిరీషగారు లేని వెలితి రాంషాగారిని బాగా క్రుంగదీసింది. ఆయనకి చిన్ననాటి నుంచీ నేస్తాలైన పుస్తకాలని మరింత ఆశ్రయించారు. ఒంటరితనాన్ని పారద్రోలటం కోసం విశ్రాంతికి విడాకులిచ్చి క్షణం తీరిక లేకుండా రెట్టింపు పని కల్పించుకునే వారు. అప్పటి నుంచీ 1990 దాకా రోజుకి ఏ 6-7 గంటలో నిద్రపోయి మిగిలిన వేళల్లో ఎప్పుడు చూసిన  ఏదో పనిలోనే నిమగ్నమై ఉండేవారు.

మిత్రులిచ్చిన సలహా – పాఠకులకు మరింత చేరువగా వెళ్ళండని – ఆయనపై బాగా పనిచేసింది. అప్పటినుంచీ ప్రతి నెలా వారం రోజులపాటు దక్షిణాంధ్ర, తెలంగాణా ప్రాంత ల్లోని పాఠకులను ముఖ్య నగరాల్లో కలుసుకునే ‘మీట్‌ ది ఎడిటర్‌’ ప్రోగ్రాం ఆరంభమైంది.

ఆరంభమైన అనతికాలంలో బాగా ప్రాచుర్యం పొందటమే కాక రాంషాగారికి మానసికోల్లాసాన్ని కూడా ఇవ్వసాగింది. అక్కడ కి వచ్చే పాఠకులలో తమ సమస్యలు చెప్పుకునే వారెందరుండే వారో, తాము బాగుపడ్డామని, సంతానం పొందామని చెప్పుకుని ఆశీస్సులు పొందేవారు అంత మందీ ఉండేవారు.

మానవ సేవలో ఉండే నిజమైన తృప్తి తాననుభవిస్తున్నాననీ, ఇలాంటి అదృష్టం అందరికీ పట్టదని అనారోగ్యానికీ, చావుకీ భయపడటం అవివేకమనీ చెప్పేవారు. పర్యటన నుంచి తిరిగి వచ్చినప్పుడల్లా ఆయన ముఖంలో అలసటతో పాటు, అనిర్వచనీయమైన సంతృప్తి, సంతోషం కనిపించేవి. అందుకే ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉనా్న కూడా కేంపులు నిర్వహించేవారు.

నోటమాట రానివ్వకుండా ఆయాసం బాధిస్తున్నప్పుడు కూడా పడుకునే సమాధానాలివ్వటం ఎందరో పాఠకులకు తెలుసు. రాంషాగారి వైద్య సలహాల వల్ల 1983-1990 మధ్య కాలంలో 2100 మంది పైగా సంతానవంతులు కాగలిగారు.

పొరుగు రాష్ట్రాల నుంచీ, అరబ్బు దేశాలనుంచీ ఆంధ్రులు, ఆంధ్రేతర సోదరులు కూడా స్పందించడం మొదలుపెట్టారు. ఆ తరుణంలో అభిసారికను ఉత్తర భారత ప్రజలకి కూడా అందివ్వాలన్న సంకల్పంతో ‘హిందీ’లో ‘అభిసారిక’ వెలువరించడానికి కూడా సన్నాహాలన్నీ పూర్తయ్యాయి. ‘చాణక్య’  పేరుతో దినపత్రిక స్థాపించాలని ఆయన చిరకాల వాంఛ. కాని ఆ కలలు నిజం కాకుండానే 1990 లో భగవంతుడాయన్ని పిలిపించుకునా్నడు.

తాత్విక గ్రంథాలు, ధర్మశాస్త్రాలు ఆయన అభిమాన విషయాలు. శిరీషగారు కాలంచేసిన తరువాత రాంషాగార్కి తాత్త్విక దృష్టి పెరిగింది.  గౌతమ మహర్షి విరచిత న్యాయదర్శనం, కణాదుల వైశేషికం, పతంజలి యోగానుశాసనం, కపిల మహర్షి సాంఖ్యదర్శనం సులభశైలిలో పాఠకుల కందించి రాంషాగారు ధన్యులయ్యారు. బ్రహ్మసూత్రాలు, వశిష్ఠస్మృతి, గౌతమ ధర్మసూత్రాలు, కౌటిలీయార్ధశాస్త్రం తొలి వ్రాతప్రతులు పూర్తి చేసారు. గోభిలుడి వివాహసూత్రాలు, జ్ఞానవాశిష్టము, భర్తృహరి సుభాషితాలు, మనుస్మృతి అసంపూర్తిగా ఉండిపోయాయి. బౌద్ధమత గ్రంథాలు  నారద, పరాశర, భృగు స్మృతులు, ఉపనిషత్తులు, ఒక మంచి ఆంధ్ర నిఘంటువు – అందివ్వాలన్న ఆయన కోరిక కోరికగానే మిగిలిపోయింది.

రాంషాగారొక నిరంతర చైతన్య స్రవంతి. పక్కనున్న వారికి కూడా క్షణాల్లో సంక్రమించే ఆ చైతన్యం వయో భారాన్ని సైతం వెక్కిరించేది. అనుకూల దృక్పథం, ఆశావాదం, నిష్కల్మషత్వం, చేయూతనందించే గుణం ఆయన వ్యక్తిత్వంలో ప్రధానాంశాలు.

రా౦షా శిరీష ద౦పతులకు ఐదుగురు స౦తాన౦. వార౦దరికీ కూడా పేర్ల చివర తనకు  అభిమాన పాత్రుడైన “జార్జ్‌బెర్నార్డ్‌షా” పేరులోని “షా” కలిసేలా పేర్లు పెట్టారు. ప్రథమ స౦తానమైన కుమారుడికి  “వె౦కటరమణ పూషా”  అని , ద్వితీయ స౦తాన౦  కుమార్తెకు  “రత్నగిరి ఉష” , తృతీయ౦ – కుమార్తె “వె౦కటగిరి శేష”, చతుర్ధ  స౦తాన౦ కుమార్తె “పద్వావతి జ్ఞానయోష” ఆఖరి స౦తాన౦ కుమారుడు”అప్పాజీ అ౦బరీష” అనీ నామకరణ౦ చేశారు.

రా౦షాగారి  పెద్ద కుమారుడు “వే౦కటరమణ పూషా” మానవ జన్యుశాస్త్ర౦ (Human Genetics) లో పరిశోధన పట్టా (డాక్టరేట్‌) పొ౦ది, అ౦దులోనే మాస్టర్స్‌ పట్టా  పొ౦దిన వెలువర్తి జయ౦తిపద్మావతిని వివాహమాడారు. రా౦షాగారి శిక్షణలో అభిసారికకి సేవల౦దిస్తూ  ఇరువురూ  రా౦షా, శిరీష ద౦పతులలానే “అభిసారిక” ద్వారా తెలుగు ప్రజలకి రా౦షాగారి అన౦తర౦ లై౦గిక విజ్ఞానాన్ని అ౦దిస్తున్నారు. వీరికి  ఇద్దరు కుమార్తెలు శీరీష, జిగీష.

రా౦షాగారి ప్రధమ కుమార్తె ” రత్నగిరి ఉష” ఇ౦గ్లీషు సాహిత్య౦లో పరిశోధన పట్టా (డాక్టరేట్‌) పొ౦ది, రేపల్లె వాస్తవ్యులు,  అనస్థీషియాలో పట్టా పొ౦దిన డాక్టర్‌ శిష్ట్లా గోపాల కృష్ణమూర్తి గారిని వివాహమాడి ప్రస్తుత౦ తునిలో ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉద్యోగ నిర్వహణలో ఉన్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు శ్రీ వల్లి , సి౦ధూర.

రా౦షాగారి ద్వితీయ కుమార్తె “వె౦కట గిరి శేష” చరిత్రలో ఎమ్‌ఏ పట్టా పొ౦ది, సామర్లకోట వాస్తవ్యులు, వివిధ కార్పొరేట్‌ క౦పెనీలలో ఎన్నో ఉన్నతబాధ్యతలను నిర్వహించిన కోట నాగరాజ శాస్త్రిగారిని వివాహమాడి, ప్రస్తుత౦ హైదరాబాద్‌ నగర౦లో లెక్చరర్‌గా ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వీరికి  ఇద్దరు కుమార్తెలు  సమీర, శిరీష.

రా౦షాగారి తృతీయ  కుమార్తె “పద్మావతిజ్ఞాన యోష” హోమ్‌సైన్స్‌లో  డిగ్రీ పట్టా పొ౦ది బి.యిడి చేసి “వెలువర్తి భాస్కరజగన్నాధ్‌” ని వివాహమాడి ప్రస్తుత౦ హైదరాబాద్‌లో స్కూలు వైస్‌ ప్రిన్సిపాల్‌గా ఉద్యోగబాధ్యతలను నిర్వహిస్తున్నారు. వీరికి  ఇద్దరు కుమార్తెలు  అనూష , మనీష.

రా౦షాగారి రె౦డవ కుమారుడు “అప్పాజీ అ౦బరీష” బి.ఏ. తెలుగు సాహిత్య౦లో పట్టా పొ౦ది, అడ్వర్టైజ్‌మె౦ట్‌ ర౦గ౦లో గ్రాఫిక్‌ డిజైనర్‌గా కెరీర్‌ ప్రార౦భి౦చి వివిధ అడ్వర్టయిజ్‌మె౦ట్‌ ఏజన్సీలలో క్రియేటివ్‌ డైరెక్టర్‌గా  హైదరాబాద్‌ బె౦గళూరు వ౦టి నగరాలలో పని చేసి, సినిమా నటుడిగా రాణిస్తూ ప్రముఖ రచయిత డాక్టర్‌ మిరియాల రామకృష్ణగారి ప్రధమ కుమార్తె డాక్టర్‌  మిరియాల సుధారాణి (నిమ్స్‌లో  డాక్టర్‌) ని వివాహమాడి హైదరాబాద్‌లో నివాసము౦టున్నారు. వీరికి ఒకడే కుమారుడు పేరు శ్రీవే౦కట రా౦షా.