Articles on Ramsha

రాంషా సాహిత్యం – వ్యక్తిత్వం

– మాల్యశ్రీ

(అభ్యుదయ జూన్‌-ఆగష్టు, 1992).

రాంషా పేరు చెప్పగానే అభిసారిక’ పత్రికా సంపాదకుడుగానే ఈ తరం వారందరికీ అర్థమవుతుంది. కాని అంతకు చాలా కాలం క్రితమే ఆయన లబ్ధప్రతిష్టుడైన రచయిత. తన కథల ద్వారా, నవలల ద్వారా, నాటకాల ద్వారా, కవితల ద్వారా, విమర్శల ద్వారా ఆధునిక అభ్యుదయ సాహిత్యంలో ఒక విలక్షణమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు.

‘రాంషా’ అనే కలంపేరు ధరించక ముందు ఆయన దర్భా వెంకట రామశాస్త్రి. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట సమీపంలోని వేట్లపాలెంలో 1924 జూలై 30వ తేదీన జన్మించాడు.

కాకినాడ పి.ఆర్‌. కాలేజీలో ఎఫ్‌.ఎ. చదువుతుండగానే ‘శిలాప్రతిమ’ అనే నాటిక రచించి రజత పతకం బహుమతి పొందాడు. ఆ రోజుల్లో ఆయన అందరితో అంతగా కలవక ఒంటరి జీవితాన్నే ఎక్కువగా అభిలషించేవాడు. ఆ చిత్తవృత్తే ఆయన్ని అంతర్ముఖుణ్ణి చేసింది. అది ఆలోచనాపరుడుగా, తార్కికునిగా, కవిగా, రచయితగా, విమర్శకుడుగా పరిణమించడానికి దోహదం అయింది.

సరిగ్గా ఆ రోజుల్లోనే కళాశాల విద్యార్థి నాయకుడూ, చైతన్య భావుకుడూ, యువకవీ అయిన శ్రీ సోమసుందర్‌ తన నిశిత పరిశీలనా దృష్టితో వెంకట రామశాస్త్రియొక్క విలక్షణత్వాన్నీ, విశిష్టతనీ గుర్తించి, అతని స్నేహ సాన్నిహిత్యాల కోసం ప్రయత్నించి, సఫలీకృతుడయ్యాడు. ఆనాటినుంచే వారిద్దరూ ఆప్తమిత్రులయ్యారు. కలిసిమెలిసి తిరిగారు. ఒకరి ప్రభావం ఒకరి మీద ప్రసరించింది. సాహిత్యంలోనూ, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ, సామ్యవాద ఉద్యమాల్లోనూ ఈ ఇద్దరు మిత్రులూ నరనారాయణుల్లాగ సంచరించడం మొదలుపెట్టారు.

ప్రముఖ పరిశోధకుడూ, సాహిత్యమూర్తీ అయిన శ్రీ నిడుదవోలు వెంకటరావు గారు కళాశాలలో వేంకటరామశాస్త్రికి ”రాంషా” అనే అన్వర్థ లేఖినీ నామం ఖాయం చేశారు.

రామశాస్త్రి విద్యార్ధి జీవితంలోనే ప్రాచ్యపాశ్చాత్య కళాసాహిత్య గ్రంథాలెన్నో విస్తృతంగా చదివాడు. ప్రముఖ ఇంగ్లీషు నాటక కర్త బెర్నార్డుషా సాహిత్య ప్రభావంతో కాబోలు రామశాస్త్రల్లా ‘రాంషా’ గా రూపాంతరం చెందాడు.

ప్రముఖ భావకవితా ప్రసారకులైన వెంకటపార్వతీశ్వర కవులూ, గౌతమీకోకిల  వేదుల సత్యన్నారాయణశాస్త్రి, కృష్ణపక్ష కృతికర్త దేవులపల్లి వెంకటకృష్ణశాస్త్రి వంటి హేమాహేమీల పరిచయ సాహచర్యాలతో శ్రీ రాంషా తన సృజనాత్మక కృషికి వన్నెలు దిద్దుకున్నాడు. ‘ఇంతింతై వటుడింతై’ అన్న చందంగా క్రమంగా బహుముఖ ప్రతిభావంతుడైన సాహిత్యవేత్తగా ఉన్నత శ్రేణికి చేరుకున్నాడు. 1948లో అఖిలాంద్ర  కవిపండిత పరిషత్తు చోడవరంలో ఈయనను తొలిసారి సన్మానించింది.

”కామేశ్వరి కథ” అనే మానసిక, జీవిత విశ్లేషణాత్మకమైన ఈయన నవల 1946లో ప్రచురింపబడి ఎన్నో ప్రశంసల నందుకున్నది. ఇప్పటికి అనేక ముద్రణలు పొంది లక్ష కాపీల వరకు అమ్ముడుపోయింది. 1951లో ”మనస్తత్వాలు’ అనే కథల సంపుటిని ఈయన ప్రచురించాడు. ఇందులోని కథలు కళాత్మకంగా, సాహిత్యపరంగా ఎంతో విశిష్టమైనవి. అభ్యుదయ భావప్రేరితాలు, సామాజిక స్పృహగల  ఇతివృత్తాలు గలవి. ఇతర భాషలలోకి అనువాదం కాదగ్గవి. అలాగే చరిత్రహీనుల్ని, బాధోపహతుల్నీ చిత్రించిన మరెన్నో మంచి కథలు ఆనందవాణి, అభ్యుదయ, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, జ్యోతి, అభిసారిక పత్రికలలో ప్రచురించాడు. వాటిలో కొన్ని కథల్ని, మళ్ళీ కథల సంపుటాలుగా తనే ప్రచురించాడు. అవే ‘పెళ్ళి తిరకాసు’ (1948), మీనాక్షి ముద్దు” (1956), ప్రియురాలు (1990) మొదలైనవి. కథారచనా లక్షణాన్ని నిర్దేశిస్తూ, ”కళలు-కథలు” అనే సముచితమైన ఉత్తమ విమర్శగ్రంథం కూడా రచించి, ప్రచురించాడు. నవల, నాటకం, కావ్యం, విమర్శ మొదలైన సాహిత్య ప్రక్రియల మీద కూడా నిర్దిష్టమైన ప్రామాణిక ప్రాయోజిత గ్రంథాలు కూడా రచించాడు. అవి ఏవో కొన్ని పత్రికలలో కొన్ని భాగాలుగా మాత్రమే ప్రచురితమై సమగ్ర గ్రంథాలుగా ప్రచురింపబడక తీరని లోటుగా మిగిలి, సాహిత్య రంగంలో రాంషా సంపూర్ణ ప్రతిభావికాసానికి గ్రహణం ఏర్పడింది.

లోగడ కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి సంపాదకత్వంలో కొంతకాలం వెలువడిన ‘జయంతి’ సాహిత్య మాస పత్రికలో డా. శ్రీ కేతవరపు రామకోటి శాస్త్రిగారి విమర్శల్ని ఎదుర్కొని చీల్చిచెండాడిన సాహిత్య సవ్యసాచి శ్రీరాంషా.

ప్రపంచ ప్రఖ్యాత రచయితలు టాల్ స్టాయ్, మాగ్జిం గోర్కీ రచనలు కొన్నింటిని ఆంధ్రీకరించి ప్రచురించాడు. ‘లక్షింపతిగారమ్మాయిలు’ అనే నాటకం ఒక అద్భుతమైన రచన. కన్యాశుల్కం తరువాత చెప్పుకోదగ్గ నాటకం.

నాటకాలు, నాటికలు రచించడమేగాక రాంషా మంచినటుడు కూడా. తమ సామర్లకోట కళాకేళీ థియేటర్‌ తరపున గొల్లప్రోలు ఆంధ్ర నాటక కళాపరిషత్‌ పోటీలలో ‘కుళ్ళుసరుకు’ అనే ప్రభోదాత్మక సాంఘిక నాటకం ప్రదర్శించి, అందులో ఒక ముఖ్య భూమికలో నటించి ఉత్తమ బహుమతిని పొందిన ప్రతిభాశాలి.

గాంధీజీ పెట్టిన భిక్ష, ఎర్రజెండా, మత్తానయ్య మరణం, ఆడవాళ్ళసంత, కిర్రు చెప్పులు, కారుణ్యం మొదలైన కథలు రాంషా మార్కు కథాకథన శిల్పానికి, వస్తు వైవిధ్యానికి, శైలీ విన్యాసానికి నిదర్శనాలుగా నిలుస్థాయి. ఒక్కసారి పాఠకులు గనుక వాటిని చదివితే, వారి హృదయాలలో సుస్థిరంగా నిలిచిపోతాయి.

తెలంగాణా పోరాటం నేపథ్యంగా ప్రజ్జ్వరిల్లిన సోమసుందర్‌ ‘వజ్రాయుధం’ ఆరుద్ర ‘త్వమేవాహం’ వంటి అగ్రశ్రేణి అభ్యుదయ కావ్యాలకి తన నిశితమైన మేధాశక్తితో, ప్రతిభావంతంగా ప్రకాశికలు రాసి ప్రచురించి, వాటికి అద్వితీయమైన ప్రాచుర్యం కల్పించిన ఘనత శ్రీ రాంషాది. మందీ-మనిషి, బానిసల దేశం, రోదసి వంటి గ్రంథాలకు అమూల్యమైన పీఠికలు కూడా వ్రాశాడు. ఇవన్నీ చదివితే రాంషా సామర్థ్యం మరో కోణంలో అర్థమవుతుంది.

”అడుగుజాడ గురజాడది

అది భావికి బాట”  –  అన్నాడు శ్రీశ్రీ.

ఆ బాటలో నీటుగా, నిబ్బరంగా నడచివచ్చినవాడు రాంషా. సంస్కరణాదృక్పథం, అభ్యుదయభావం, కళాత్మకత, సులభగ్రాహ్యత, మానవతా ప్రబోధం, దేశభక్తి సందేశం – శ్రీ గురజాడ ఆదర్శాలు. శ్రీ రాంషాకి కూడా అవే ఆచరణీయాలు! అందుకు నిదర్శనాలే ఆయన రచనలు!

అంతేగాకుండా రాంషా కార్యశీలికూడా!

తాను రచనలు సాగిస్తున్న కాలం స్వాతంత్రోద్యమం, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం, ఆంధ్రరాష్ట్ర సాధనోద్యమం ముప్పిరిగొని, ముందంజవేస్తున్న జ్వాజ్జ్వల్యమాన కాలం! ఆ కాలమాన పరిస్థితులకు స్పందించి శ్రీరాంషా కార్యరంగంలోకి దూకి కలం ఝళిపించాడు.

శ్రీ సోమసుందర్‌, శ్రీ శశాంక మొదలైన సన్నిహిత కవి మిత్రులతోనూ ఇతర ప్రముఖులతోను కలిసి, చేయి చేయి కలిపి, భుజం భుజం కలిపి, కమ్యూనిష్టు కార్యకర్తగా కదనశంఖం పూరించాడు (1944-1955).

పాలకులు తీవ్ర నిర్బంధకాండ అమలు జరిపి, ప్రగతి వాదుల్ని తుదముట్టిస్తున్న తరుణంలో, ఉద్యమాలు వెనుకడుగు వేసి రక్షణ కోసం స్థావరాలు వెదుక్కొంటున్న విపత్కర పరిస్థితుల్లో, వ్యూహం మార్చి, సాహిత్య రంగంలోకి పరావర్తనం చెంది, ప్రజాచైతన్యం ప్రజ్వలింపజేయడానికి సంకల్పించి, సాహసవంతుడు సోమసుందర్‌తో కలిసి దండోరా పత్రికను ప్రారంభించాడు.’కళాకేళి – ధర్మ సంగ్రామకేళి’ అని నినదిస్తూ ప్రచురణాలయం నెలకొల్పి, నిర్వహించాడు శ్రీరాంషా. సామ్యవాద ఉద్యమ ప్రతిధ్వనులైన ఆరుద్ర ‘త్వమేవాహం’, సోమసుందర్‌ ‘వజ్రాయుధం’, శశాంక ‘నయాజమానా’, తన ‘అనంతం’ మొదలైన అభ్యుదయ కావ్య సంపుటాలు ప్రకటించి, అభ్యుదయ సాహిత్య చరిత్రలోనే ఒక ఉజ్జ్వల ఘట్టానికి నాందీ వాచకం పలికాడు.

కాని ప్రభుత్వం మిన్న కుండలేదు. తన దమనకాండని సాహిత్యం మీద కూడా ఎక్కుపెట్టి రాంషాదుల ఊహల్ని తల్లకిందులు చేసింది. వజ్రాయుధం కావ్యాన్ని నిషేధించి, పుస్తకాల్ని జప్తుచేసి, ప్రచురణకర్త రాంషా మీద, ముద్రాపకులు అవంతీప్రెస్‌ యాజమాన్యం మహీధరవారి మీద కేసులు పెట్టింది. ఆ ప్రతిష్ఠాత్మకమైన కేసులో శ్రీరాంషా బైటపడ్డాడు. ప్రెస్‌ యాజమాన్యానికి జరిమానా పడింది.

తీవ్ర నిర్బంధ విధానంలో అభ్యుదయవాదులైన సాహిత్యకారులు, కళాకారులు చెల్లాచెదరైనారు. కొందరు మద్రాసులో సినీ పరిశ్రమలో ఆశ్రయం పొందారు. మరికొందరు పత్రికారంగంలో, ప్రచురణా సంస్థలలో ప్రవేశించారు. అలాంటి దుర్భర పరిస్థితులలో శ్రీరాంషా కూడా పాత్రికేయుడిగా నిలద్రొక్కుకోడానికి అనేక కష్టనష్టాల నెదుర్కొని, క్లిష్ట సమస్యలు చవిచూచి, చివరకు సామర్లకోటలోనే ప్రజారంజకమైన పుస్తకాలు ప్రచురించడం మొదలు పెట్టాడు.

కాని, అందులో కూడా ఆయన కృతకృత్యుడు కాలేకపోయాడు. ఐశ్వర్యంలో పుట్టినా, ఆ తర్వాతి పరిస్థితుల వల్ల ఆయన అతిదారిద్య్రం అనుభవించవలసివచ్చింది. ఎంతటి శక్తివంతుడైనా, భుక్తికే సంకటపడవలసి వచ్చింది. అలాంటి సమయంలో ఆప్తమిత్రుడు శ్రీ ధనికొండ హనుమంతరావు కొంతకాలం నడిపి ఆపివేసిన తన ‘అభిసారిక’ పత్రికను రాంషాకి అందించాడు. ఆ విధంగా అభిసారిక పత్రికను స్వీకరించి చిన్నగా నడపసాగాడు శ్రీరాంషా (1960).

ప్రజ్ఞానిధి రాంషా నేతృత్వంలో వినూతనంగా, విజ్ఞానాత్మకంగా నడుపబడుతున్న ‘అభిసారిక’ అచిరకాలంలోనే అసంఖ్యాక పాఠకుల మన్ననలు పొంది, బహుళ ప్రచారంలోకి వచ్చింది. అది- మూఢ విశ్వాసాలతో, ఛాందస భావాలతో, అజ్ఞానంలో, అంధకారంలో అల్లాడుతున్న అనేక మంది ఆంధ్రపాఠకులకు – వేగుజుక్కగా రూపొందింది. ప్రాచ్య పాశ్చాత్య గ్రంథాల్ని అనేకంగా పఠించి, పరిశోధించి, క్రోడీకరించి, శాస్త్రీయంగా – విజ్ఞానదాయకంగా ‘సెక్సువిజ్ఞానాన్ని’ అభిసారిక పత్రికద్వారా పాఠకుల కందజేస్తూ ఆత్మ విశ్వాసం కోల్పోయి – అనేక మానసిక రుగ్మతలకులోనై, అశాంతితో – అపోహలతో – సమస్యలతో-  సంతాపాలతో సతమతమవుతున్న అసంఖ్యాక వ్యక్తులకు ఆశనీ-ఆత్మధైర్యాన్నీ కల్పించి, ఓదార్పునీ – ఓజస్సునీ ప్రసాదించి, నైతిక బలాన్నీ – నవజీవనాన్నీ ప్రోదిచేసి, వారిని సత్ప్రవర్తకులుగా – సంతోషప్రదులుగా తీర్చిదిద్దే మహోద్యమంలో శ్రీరాంషా అహోరాత్రులు అమోఘకృషి చేసి, అందులో విజయం సాధించాడు.

ఆ కృషిలో భాగంగా ఎన్నో ఉత్తమ వైజ్ఞానిక గ్రంథాలు రచించాడు. అద్భుతమైన ఔషధాలకు రూపకల్పన చేశాడు. ‘అడగండి చెపుతాను’ శీర్షిక ద్వారా అనేకమంది వ్యక్తిగత సమస్యలకు పరిష్కారాలు సూచించాడు. ‘మీట్‌ ది ఎడిటర్‌’ కార్యక్రమం ద్వారా ఆంధ్రా – ఆంధ్రేతర ప్రాంతాలు పర్యటిస్తూ సలహాలు – సందేశాలు అందజేశాడు. ఈ అపారకృషిలో ఆయన అర్ధాంగి శ్రీమతి శిరీషగారి సహాయసహకారాలు కూడా ఆయనకు లభించాయి. అందుకే ఈనాడు తెలుగునాడులో లెక్కకు మిక్కిలిగా రాంషాలు-శిరీషలు వెలిశారు. ఇది రాంషా యొక్క గొప్ప వ్యక్తిత్వానికీ, విజ్ఞాన గరిమికి నిదర్శనం!

శ్రీమతి శిరీష 1982లో కాలధర్మం చెందింది. ఆమె పేర శిరీషా అవార్డు నెలకొల్పి తన సాహిత్య అభిమానాన్ని ప్రదర్శించాడు.

తనదైన సమగ్ర దృక్పథంతో ‘చాణక్య’ అనే దిన పత్రికను నెలకొల్పాలనే లక్ష్యంతో, అన్ని సన్నాహాలు చేశాడు. అందుకోసం అన్ని హంగులతో కూడిన అధునాతనమైన ప్రింటింగ్‌ ప్రెస్‌నూ, కంప్యూటర్‌ యంత్రాలను సమకూర్చుకున్నాడు.

కాని ఇంతలోనే ఆయన యత్నానికి అంతరాయం కలిగింది. ది. 8-2-90వ తేదీన రాజమండ్రిలో ఏటేటా జరిగే పుస్తక ప్రదర్శన ముగింపు ఉత్సవాన్ని తిలకించేందుకు, తన కారులో వెళ్తూ ఎదురుగా వస్తున్న ఆర్‌.టి.సి. బస్సు ఢీకొనడంతో, కవి మిత్రుడు గోదావరి శర్మతో సహా దుర్మరణం పాలయ్యాడు శ్రీరాంషా. ఇది తెలుగు  పాఠకలోకానికి ఆశనిపాతం! తీరనిలోటు!

ఎన్నో వ్యక్తిగత సమస్యలు పరిష్కరించి, ఎందరి జీవితాలకో వెలుగు నిచ్చి, ఎన్ని కుటుంబాలనో నిలబెట్టి, ఎంతో సంస్కారం బోధించి, ఎంతో విజ్ఞానం వెదజల్లిన శ్రీరాంషా ఒక వ్యక్తి కాదు, ఒక మహా సంస్థ!

తన కుటుంబ భుక్తి కొరకేకాదు; ఎందరికో నూతన శక్తినీ, దు:ఖ విముక్తిని ప్రసాదించిన గొప్ప వ్యక్తి! ఫ్రాయిడ్‌, ఆడ్లర్‌, జంగ్‌, ఎల్లీస్‌ మొదలైనవారి మహా విజ్ఞానాన్ని తెలుగు పాఠక ప్రపంచానికి విస్తృతంగా పంచిపెట్టిన ప్రతిభామూర్తి శ్రీరాంషా! ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ‘భారతీయ హేవలాక్‌ ఎల్లీస్‌’!.

వాత్స్యాయన కామసూత్రాలూ, గౌతమ ధర్మసూత్రాలూ, జ్ఞాన వాశిష్ఠం, న్యాయ దర్శనం, సాంఖ్యమ్‌, వైశేషికమ్‌, యోగ శాస్త్రం, కౌటిల్య అర్థశాస్త్రం మొదలైన సంస్కృత గ్రంథాల్ని మధించి, అమృతసారాన్ని సాధించి, తేట తెలుగులో రచనలు వెలువరించి, ప్రచురించాడు. మరో మాటలో చెప్పాలంటే శ్రీరాంషా ప్రపంచ మేధావుల్లో ఒకరు! అన్నిటికీ మించి ఆయన అచ్చమైన అభ్యుదయ కవి! ఆయన ఇటీవలే (1988) తన ‘అనంతం’ కావ్యాన్ని పునర్ముద్రించి, సాహితీ ప్రియులకు అందజేయడం ఆయన కవిత్వాభిమానానికి తార్కాణం! అభ్యుదయ కవితా సరస్వతి కది మరో అరుణాంజలి!

(ది.6-3-90 వ తేదీన గౌతమీ నవ్యసాహితి ఆధ్వర్యంలో చర్లలో జరిగిన శ్రీరాంషా సంస్మరణ సభలో శ్రీ మాల్యశ్రీ చదివిన ప్రసంగ వ్యాసం).