Articles on Ramsha

అజరామరుడు

– బులుసు సూర్య ప్రకాశం

23.2.90.

రాంషాగారు పోయేరట యాక్సిడెంటు అయి!

ఎవరన్నారు? ఆయన పోవడం ఏమిటి?

ఎవరేమిటి? పత్రికలు, రేడియోలు, టి.వీలు ఘోషిస్తున్నాయి. అభిసారిక పత్రికాధిపతి రాంషా కారు మీద రాజమండ్రి వెడుతూ యాక్సిడెంటు అయి అక్కడికక్కడే కన్ను మూసేరని.

ఇదిగో! పత్రికలు, రేడియోలు, టి.వీలు ఏం చెప్పినా రాంషాగారు పోవటం అన్నది కల్ల. చావు అన్నది నీకూ నాకూ వస్తుంది. రాంషాగారికి కాదు.

వాల్మీకి, వ్యాసుడు, షేక్స్పియరు, కాళిదాసు – ఇలాంటివారు మరణించరు. వాల్మీకి మాటలు ఆయన రామాయణం ద్వారా మనకు వినిపిస్తూనే ఉన్నాయి. వ్యాసుడు తన రచనల ద్వారా ఉపదేశిస్తూనే ఉన్నాడు. షేక్స్పియరు, కాళిదాసు తమ నాటకాలలో కనిపిస్తూనే ఉన్నారు. వాళ్ళకు చావు ఉండదు.

వాళ్ల విషయం సరే! ఏదో ‘అభిసారిక’ అన్న చిన్న పత్రిక ద్వారా వెలుగులోకి వచ్చిన రాంషాకూ వాళ్ళకూ పోలిక ఏమిటి? ఆ పత్రిక నిండా శృంగార విషయమే. స్త్రీ పురుషుల సంయోగ విషయమే నాయె!

అభిసారిక అంటే అర్ధం తెలుసా? తెలుసును అనుకోను. ‘కామార్తాభిసరేత్ కాంతం సారయే ద్వాభిసారికా’– కోరికతో భర్త వద్దకు (ప్రియుని వద్దకు) స్వయంగా కదలి ఎదురు వెళ్ళేది అభిసారిక.

తన ప్రియుడు తన్ను అనుభవించాలి, ఇద్దరూ ఆనందించాలి – అన్న వేగిరపాటుతో కదిలేది కదా అభిసారిక! ఈ లెక్కన చూస్తే ప్రతి పత్రికా అభిసారికయే. పాఠకులు ఆదరంతో తమ్ము కన్నులకు అద్దుకోవాలనే ప్రతీ పత్రికా కదులుతోంది.

కాదు.

పురుష సంయోగానికి సంబంధించిన తెలివిని పెంచే సాహిత్యం లోకానికి ఉపకారమే చేస్తుంది. అపకారం

కామసూత్రాలను రచించిన కారణంగానే వాత్స్యాయనుడు మహర్షి అయినాడు. ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే నాల్గింటిలో ఏదీ దేనికీ తక్కువ కాదు. మను ధర్మశాస్త్రం, కౌటిల్యుని అర్థశాస్త్రం, వాత్స్యాయనుని కామశాస్త్రం, వ్యాసుని బ్రహ్మసూత్రాలు (మోక్షశాస్త్రం) ఒక్కొక్కటీ ఒక్కొక్క పురుషార్థాన్ని గూర్చి బోధిస్తున్నాయి. ఇవన్నీ సమ ప్రతిపత్తి కలవే. అన్నిటికీ సమానమైన ప్రచారం కావాలి. అది సాధించిన ఘనత రాంషాగారిది.

కాగా రాంషాగారు, అభిసారిక ఆంధ్ర లోకానికి చేసిన సేవ సామాన్యమైనది కాదు.

స్వీయ ప్రతిభతో ఎన్నో వడిదుడుకులు తట్టుకొని, చాటున మాటున సాగించే విమర్శలకు నవ్వుకొంటూ అభిసారికి పత్రికను అసహాయశూరుడై నిర్వహించిన మహామనిషి రాంషాగారు.

ప్రాచీనులున్నారు! వాళ్ళలో చాలామంది చాలా తెలివైనవాళ్ళు. వాళ్ళు తమ గ్రంథాలలో ఎన్నో విజ్ఞాన విషయాలు రహస్యంగా నిక్షిప్తం చేసి ఉంచేరు. వానిని గుర్తించడానికి కేవల పాండిత్యం చాలదు. శివునకున్నట్లు మూడవ కన్ను- జ్ఞాన నేత్రం కావాలి. ఆ నేర్పు అంటే మొదటి చూపులోనే జీవనాడిని పట్టుకొనే మెలకువ రాంషాగారికి ఆజన్మసిద్ధమైనది.

ఒక మేలైన విషయం ఆయన దృష్టిలో పడితే అది తెలుగులో సుందరంగా రూపుదిద్దుకొని అభిసారిక ద్వారా అందరకూ అందవలసిందే! అంతవరకూ రాంషా గారు ఒక తపస్వి, ఒక యోగి.

తెలుసా! ఆయన మంచి కవి, మంచి విమర్శకుడు.

ఇది కవిత్వానికి కాలం కాదని ఆయ నా వంక తన కలాన్ని సాగించలేదు. గద్యాన్ని, పద్యాన్ని, బింకంగా, పొంకంగా సమసుందరంగా నడపగల సవ్యసాచి ఆయన.

ఇక ఆయన విమర్శచేసే విధానం. ఇది సాటిలేనిది. దానిలో పుష్పవర్షానికి ఎంత జోరు ఉంటుందో అస్త్రవర్షం కూడ అంత నిర్దయగా సాగుతుంది. ఆయన విమర్శకు వ్యాసుడైనా వాల్మీకి అయినా తల వంచవలసినదే. అది అంత సముచిత ధోరణిలో సాగించడం ఆయనకే సాధ్యం. ఆ కారణం వల్లనే ఆయన వేదిక ఎక్కితే సభలో చైతన్యం వెల్లివిరిసేది. ఆయన ఎపుడో కాని, తన అమ్ములపొది నుండి పద్యాన్ని బయటపెట్టేవారు కాదు. ఎపుడైనా సభలో అలా పద్యాన్ని ఆయన పలికితే దాని మెరుపుకు మేమే పండితులం అనుకొనేవారు కూడ దిగ్భ్రాంతులే అయ్యేవారు.

కొన్ని నెలలు పాటు ఆయన వరుసగా రాజకీయ ఉపన్యాసాలు యిచ్చేరు. ఊరూరు, వీధి వీధి తిరిగి ఉ పన్యాసాలు యిస్తూ వచ్చినా- చెప్పినది చెప్పడం ఒకే తీరులో చెప్పడం లేదు. జనాన్ని బట్టి వారి సంస్కారాన్ని బట్టి ఒక్కొకచోట ఒక్కొక మధుమయ ఫణితి. ఒక్కమాటలో చెప్పాలంటే – “నిలువ బడియున్న విజ్ఞాన నవహ మతడు!”

అన్నిటినీ మించిన విషయం – చీకటి కోణాలుగా ఉన్న ఎన్నో సంసారాలలో రాంషాగారి వల్ల ఆనందం వెన్నెలై పరచుకొన్నది.

భార్యకు భర్తకు వివేకం చాలక సుఖం లేదు. ఎంత ధనమున్నా ఏమి ప్రయోజనం? వాళ్ళు ఎవరితోనూ చెప్పుకోరు. మనసులో మ్రగ్గుతూ ఉంటారు. అట్టి వారి సమస్యకు – తానే వారివద్దకు వెళ్ళి దానిని నివారించడానికి ఆయన చేస్తూ వచ్చిన కృషికి ఎవరు వెల కట్ట గలరు?

రాంషాగారి స్థూల శరీరం పోయిందే కాని ఆయన చేసిన సాహిత్య సృష్టికి నాశమంటూ లేదు, ఉండదు. దాని ద్వారా ఆయన లోకానికి ఉపదేశిస్తూనే ఉంటారు. రాంషాగారు అజరామరుడు.

జాయా అంటే భార్య. “జాయతే పత్రి పుత్రరూపేణ అస్యాం ఇతి

ఈమె యందు జన్మిస్తున్నాడు. కనుక ‘జాయ’ అన్నారు.

జాయా” భర్త యే కుమారుని రూపంలో..

రాంషాగారికి ఇద్దరు కుమారులు. మొదటి వాడు పూషా, రెండవవాడు అంబరీష.

పితృవియోగ దుఖం అనే మబ్బు కొంచెం తొలిగితే చాలు, ఈ పిల్లలు దున్నే కాంతినాగలి చాళ్ళలో అడుగడుగున ఎందరో రాంషాలు!

జయంతి తే సుకృతినో రససిద్దా: కవీశ్వరా:

యేషాం నాస్తి యశ:కాయే జరామరణజం భయం.

* * *