ఆంధ్ర పత్రిక – సచిత్రవారపత్రిక 6-6-1951
రాంషా కథానిక :
అతన్ని నేను బాగా ఎరుగుదును, మా బళ్ళోకి వెళ్లేదారిలో అరుగుమీద కూర్చుని అతను జోళ్లు కుట్టేవాడు. అతన్ని నేను బాగా ఎరుగుదును. అతను కుట్టిన జోళ్లుమాత్రం ఆ ఊరివారందరికీ బాగా తెలుసు. అతని ముఖం ముందు కాకపోయినా చాటుగానన్నా వాటి శ్రేష్ఠతను గురించి నలుగురూ కచేరీ సావిట్లో కూర్చొని చెప్పుకొనేవారు. అప్పడు జోడు కుట్టడం తడువు ఎవరిమటుక్కు వారే పోటీలు పడి పట్టుకుపోయేవారు.
అతన్ని మొదటిసారిచూసింది నా ఆరో ఏట. అప్పటి జోళ్ల మన్నికనీ, వాటి చౌక తనాన్నీ ప్రశంసించేవారయితే చాలామంది ఉన్నారుగాని అప్పడి జీవిత రహస్యాన్నీ, అతని జీవిత తత్వాన్నీ తెలిసిన వాళ్లు ఇంకెవళ్లూ లేరు. ఆ గౌరవం, ఆ ప్రతిష్ట నాకే దక్కాయి. కోహినూర్ వజ్రంకంటే అమూల్యమైన అతని అనుభవాల్ని అంత చిన్న వయస్సులోనే చిక్కబట్టుకొని జాగ్రత్తగా దాచుకొంటూ వచ్చాను.
మా నాన్నని నేను ఎరగను. మా అమ్మ కూడా నాకు సరిగా జ్ఞాపకం లేదు. మా అమ్మని సవారీమీద దేవుడిగుడికి తీసికెళ్లిన దృశ్యం మాత్రం నాకు జ్ఞాపకం. మళ్ళీ మా అమ్మ రాలేదేమని మా తాతయ్యని అడిగినప్పుడల్లా దగ్గరికి తీసుకొని కళ్లనీళ్లు పెట్టుకొనేవాడు. కడుపు మీద పడుకో బెట్టుకొని కల్లబొల్లి కబుర్లతో మరపించాలని ప్రయత్నించేవాడు. తాతయ్యే మొదట్లో నాకు ఎంతో ఇష్టమైన స్నేహితుడు. ‘మొదట్లో’ అని ఎందుకన్నానంటే రానురాను మా తాతయ్య కొంత పాడయిపొయ్యాడు. ఇరవై ఇరవైలదాకా ఎక్కాలు తలకిందులా అప్ప జెప్పమనటం బొత్తిగా మొండితనం కాకపోతే ఏమిటి?
మా తాతయ్య బాధపడలేక నేను బాధ పడుతున్న రోజుల్లో అప్పడి పరిచయం ఏర్పడింది. అప్పణ్ణి పరిచయం చేసింది కూడా మా తాతయ్యే. అప్పటికి అప్పడి వయస్సు నలభైఐదు సంవత్సరాలు. భుక్తికేమీ లోపం లేకపోయినా శాంతికిమాత్రం అతని జీవితం మొహం వాచింది. అతని ముఖంలోని ముడతలు, నెరిసిపోయిన జుట్టే అందుకు సాక్ష్యం. తన పొడుగైన జుట్టుని వెనక్కి దువ్వి చివర ముడి వేసే వాడు. నుదుటిమీది కురుల్ని ముందుకు దువ్వుకొనేవాడు. ముఖంనిండా నూనె జిడ్డు ఓడుతూ ఉండేది. తొడలమీద చిరిగిన పంచెతో ఒక్కమోకాలు ముందుకు వంచి చరచరా పనిచేసుకుపోయేవాడు. నవ్వితే అతని పెదవి నెలవుల్లో విషాదం చివురించేది. మనిషి సన్నని పొడుగైన కారు నల్లని విగ్రహం. నవ్వితే అతని హృదయం కరిగి కళ్లల్లోకి కనిపించేది.
నిజానికి నాకు మాపల్లెలో అంతమంచి అప్పడనే వాడున్నాడని కూడా తెలియదు. మా తాతయ్యతో నేను చాలాసార్లు చేలోకి వెళ్లేవాణ్ణి. నాకోసం ఆయన సెనగ మొక్కలు పీకి కాయలు తంపట పెట్టేవాడు. ఆ సెనగకాయలు వల్చుకు తిని చీకటిపడేవేళకి ఇంటికి వచ్చేవాళ్లం. మా తాతయ్య కిర్రుచెప్పులు తొడుక్కొని, నెత్తిమీద గడ్డిమోపు పెట్టుకొని, మెడమీద అడ్డంగా కర్ర ఆనించి, దొరలా ముందు నడుస్తూ ఉంటే ఆయన వెనకాలే నడవలేక నడుస్తూఉంటే పరిగెడుతూ ఆయన చెపుతూన్న ‘శుక్లాం బరధరం విష్ణుం’ మొదలైన శ్లోకాలు వల్లె వేసేవాణ్ణి. నాకు ఆ శ్లోకాలు సరిగ్గా వచ్చేవి కావు. అసలు ఆ శ్లోకాలమీద నాకు ధ్యానమే ఉండేది కాదు. మాతాతయ్య చెప్పులే నా కెంతో అసూయగా ఉండేవి. సరిగ్గా అలాంటి చెప్పులే తొడుక్కొని రాజరీవి ఉట్టి పడుతూంటే, కిర్రుకిర్రు మనిపించు కుంటూ, వాటి పై జూలు నృత్యం చేస్తోంటే పరవశం పొందుతూ నడవాలని మనసుగాఉండేది. ఆ జోళ్ల మీదనగిషీ నా కెంతో ముద్దోచ్చేది. అలాంటి జోళ్లకి నేనే అధిపతినైతే రాజకుమారులు నాముందు బలా దూరేకదా! నా కలాంటి జోళ్లు కావాలని ఎంత మారాము చేసినా వట్టి కుర్ర వెధవ కింద కట్టేసి మాతాతయ్య నిర్లక్ష్యం చేసేవాడు. నేను ఉండబట్టలేక మాతాతయ్య జోళ్ళనే తొడుక్కుని తూగిపడుతూ షైర్లు కొట్టే వాణ్ణి. మాతాతయ్య ఎంత వారించినా ఊరు కొనేవాణ్ణి కాదు. చివరకి విసిగి మాతాతయ్య నావీపు శుద్ధి చేసేవాడు. మా’అమ్మ’ని తలుచుకొని రాగాలు పెట్టేట్టే సరికి మాతాతయ్య బాధపడి, సన్ను తొలిసారి అప్పడిదగ్గిరకి తీసుకెళ్లాడు.
“తల్లి లేని వెధవ అని గారాం చేస్తూంటే నా ప్రాణాలు కొరుక్కుతింటున్నాడ్రా అప్పడూ ఏదో జత కుట్టిద్దూ”. అప్పడు నాకేసి చూసి నవ్వుకున్నాడు. కొలతలు తీసుకొని, “అలాగే లెండి”, అన్నాడు.
అదే మామొదటి పరిచయం. అప్పటి నించీ రోజూ బర్లో కెళ్లేటప్పుడూ, వచ్చేటప్పుడూ అప్పడి దర్శనం చేసుకొనేవాణ్ణి. ఏక్షణం అమాంతంగా ఆ జోళ్ళు తయారై నా కాళ్లని అలంకరిస్తాయో! బళ్లో బట్టలు వేసుకొని, పలకా, బలపమూ, సరస్వతీవాచకమూ తాటాకు సంచీలో పెట్టుకొని బర్లోకి పోతూ పోతూ అప్పడి కిర్రుజోళ్ల కోసం తొంగిచూసేవాణ్ణి. బర్లో కూర్పున్నప్పుడు కూడా ఒంటి వేలుకనీ, రెండు వేళ్ళకనీ, బొటన వేలుకనీ వంక పెట్టి తిన్నగా అప్పడి దగ్గిరకు పోయి కూర్చొనేవాణ్ణి. మా ఇద్దరి పరిచయం ఆ విధంగా పెంపొందసాగేది. నేను వచ్చి కూచుంటేనేగాని అప్పడు నా జోళ్ళు కుట్టేవాడు కాడు. నాతో ఊసులాడుతూ మురిసిపోయేవాడు.
నేనూ అప్పడూ ఊసులాడుకొంటూంటే మా ఊళ్ళోని పెద్దకాపులూ, శర ణాలూ ఎందరో వస్తూఉండేవారు ‘అప్పడూ, జోళ్లు’ ‘అప్పడూ, జోళ్లు’ ‘అప్పడూ, జోళ్లు’ – అందరిదీ ఒకటే పాట ‘ఇదిగో, అదిగో’ అని ఏదో సర్ది చెపుతూనే ఉండేవాడు అప్పడు ‘అబ్బాయి గారి జోళ్లు కుడుతున్నాను; కాగానే ‘ ఆదో వంక,
“ఎవరేట్రా?” “యంకట్రామయ్యగారి మనవడండి,”
“కూతురు కొడుకా? కొడుకు కొడుకా?
“ఆరమ్మాయిగోరు పొయ్యారు కదండీ ఆరి కొడుకు”
“ఓహో !” అందరూ నాకేసి వింతగా చూసేవారు ఆమాట చెప్పిన అప్పడికి ఏదో జ్ఞాపకం వచ్చేది కళ్లల్లో విచారం అలుగుకొ నేది, మాట బరువెక్కేది.
“అమ్మోరు ఆణ్ని ఎత్తుకుపోయింది గాని నన్నెత్తుకుపోయింది గాదు. ఆ ఎదవే ఉంటేనా”
“ఎవరి ఖర్మ కెవరు కర్తలురా!” ఆ కాపులూ, కరణాలూ అప్పడి భారాన్ని విదిలించుకొని “ఒరేయ్ తొందరగా కుట్టేయ్” అని హెచ్చరించి వెళ్ళిపోయేవారు. ఎవరూ అతని దుఃఖాన్ని పట్టించుకొ నేవారు కాదు. నిజమే, ఎవరి ఖర్మ కెవరు కర్తలు?
ఎవరి ఖర్మ కెవరు కర్తలయినా కాక పోయినా ఎవరి ఖర్మని వాళ్లు అనుభవించక తప్పదు. కాని సృష్టిలోని రహస్య మేమిటంటే ఒకరి ఖర్మను ఇంకొకరుకూడా పంచుకుంటేనేగాని ఆ అనుభవించేవాడికి ఓదార్పు ఉండదు. అందుకోసం తన దుఃఖంలో పాల్గొనే వాడికోసం చూస్తాడు. ఓదార్పు లభ్యం కాకపోదు కానీ అది ఎదటివాడి గుండెల్లోంచి రాదు. అలాంటప్పుడు అది బాధపడేవాడి ఆవేదనని రెట్టిస్తుంది, దుఃఖాన్ని ఇనుమడింప జేస్తుంది. అయినా అప్పడికి ఇంత నూక్కు పోటానికి కళ్లంలోని గింజలిస్తూనే ఉంటారు. ఓదార్పు ఎక్కణ్ణించి ఇస్తారు? కాలమే దుఃఖభాగుల్ని ఓదార్చాలి. ఎవరీ దుఃఖాలు వారికే ఉన్నాయి.
ఏ దుఃఖమూ వంటబట్టనివాణ్ని నే నొక్కణ్నే అప్పడికి దొరికాను,
“ఏరా, అప్పడూ, అమ్మోరు నీకొడుకును ఎత్తుకుపోయిందా?” అని ప్రశ్నిస్తే చాలు, ‘అయ్య నా బాబే’ అని ప్రారంభించి తన కొదుకు ఎప్పుడు ఎందుకు ఎలా చచ్చిపోయాడో అదంతా పూసగ్రుచ్చినట్టు చెప్పేవాడు. నేను నోరు ఆవలించుకొని,
మోకాళ్ల మీద చేతులు ముడుచుకొని, తల ఆనించి శ్రద్ధగా వినేవాణ్ణి,
“పాపం, ఆచాల్లుగారు మందో మాకో ఇచ్చేవారండి. ఏమిస్తేనేంగాక, యదవ ఆయుస్సుమూడి చచ్చాడు.”
అప్పడి కొడుకు ఎలా చచ్చిపోయాడో ఆ చిత్రాన్నంతా ఊహించుకొని, నన్నే అప్పడి కొడుకుగా చిత్రించుకొని, అప్పణ్ణి మాతాతయ్యగా భావించుకొని, ఆ దృశ్యాన్ని భరించలేక ఏడ్చేవాణ్ణి. అది చూసి
“చేతికందిన కొడుకు చచ్చిపోయ్యాడు, బాబూ! ఎవడితో చెప్పుకోను, దేశీ మే చెవిఁటిది, బాబూ, దేవుడు నా గుండె చెరువు చేసి పుట్టించాడు”
“నీ పెళ్లామో! ” “అదా బాబా!” నవ్వేవాడు. “అది తెంపులు చేసుకొని లేచిపోయింది బాబూ, నాతో బతక లేదంట!
అతనితో ప్రతీదీ ఒక సమస్యే నాకు. నాకు అర్థంకాని, నేను ఊహించలేని ఎన్నో విషయాల్ని అతను తెలియజెప్పేవాడు. నాకు సంశయం కలిగేది.చిన్నపిల్లాణ్ణి అంతమంచి వాడితో, నేనే అంత కలసి మెలసి కాలక్షేపం చేయగలుగుతూంటే ‘అదెంచేత’ బతకలేక పోయిందో నాకు అర్థమయ్యేది కాదు. తెగతెంపులు చేసుకు లేచి పోవటమంటే ఏమిటో? “ఒకసారి మా ఆవు కన్నె తాడు తెంపుకొని వెళ్లిపోయిందని విన్నాను. మళ్లీ మాఆవును తెచ్చి కట్టుకున్నాం. అతను ఎందుకు చెయ్యకూడదు?
“అంటే?”
“ఏం లేదు బాబూ, నన్నొదిలేసింది ” “నీకు నీతల్లి ఉందా?”
“లేదు బాబూ!” నవ్వేవాడు. పాపం, తల్లి లేని వాణ్ణి అలా వొదిలేస్తే ఏమైపోతాడు? తల్లి లేని నన్ను మాతాతయ్య వదిలేస్తే నేనేమైపొవ్వాలి
అడుక్కు తినాలి ఎలాగమరి’ పెద్దవాడుగా అప్పడు! పెద్దవాళ్లని అందరూ వదిలేస్తారు గావును! నేను కూడా పెద్దయ్యాక మా తాతయ్య నన్ను వదిలేస్తాడు ఎక్కాల బాధ వదిలి పోతుంది కాని, నాభార్యకూడా లేచిపోతుందా?
“ఎందుకు వదిలేసిందీ? అందంగా లేవనా?”
“అంద మేటి, బాబూ; కంటికో అందం, నోటికో రుచీనీ. ఈ జోడు చూడు ఇంత అందమైందిగదా, ఎందుకు తొడుక్కోపూ అంటావ్. ఆజోడు ఎక్కడ కరుస్తదో తొడిగేవాడికి తెలియాలిగాని నీకు తెలుస్తదా?”
నిజమే మరి; జోడు కరుస్తుంది కాబోలు. నా జోడుకూడా కరుస్తుందా?
“జోడు ఎందుకు కరుస్తుంది, అప్పడూ?
“ఏడెక్కి తే కరుస్తది”
అవన్నీ నాకర్థంకాని సమస్యలు. మా బళ్లో ‘ఆవు పాలు ఇచ్చును,’ అని చెప్తారు. గొడ్డు ఆవు పాలిస్తుందా? అది ఎందుకివ్వదో చెప్పరు. అలాగే ఈ సమస్యలకి కూడా.
మొత్తానికి నాకు జోళ్లు తయారై పొయ్యాయి. మా తాతయ్య పావలా ఇస్తే వద్దన్నాడు. “అబ్బాయిగారి జోర్లకి కూడా డబ్బియ్యాలా, దొరగారూ. ఆరే రేపు పెద్దారై కానిస్టేబిల్ గిరీ చేసి నా రుణం తీర్చుకుంటారు లెండి”
మా తాతయ్య నవ్వి ఊరుకున్నాడు. ఆ జోళ్ళకి ఆయన డబ్బివ్వనేలేదు. ఆ రుణం మాత్రం నా భుజాలమీద ఎప్పటికీ మిగిలిపోయే ఉంది. ఆ రుణం తీర్చుకోవటానికని అప్పడి స్నేహం వదిలి పెట్టలేదు నేను. మా తాతయ్య అంగోస్త్రాన్ని కుచ్చుల తలపాగాగా చుట్టుకొని, తాటాకుసంచీ చంక కింద పెట్టుకొని, కిర్రుజోళ్ళు తొడుక్కుని యువరాజులా నడుస్తూ రోజూ మధ్యాహ్నం పన్నెంగుగంటలకే బరికి బయలు దేరి అప్పడి దగ్గర కూర్చునేవాణ్ణి.
ఆ సంగతి మా తాతయ్యకి తెలిసి నన్ను గట్టిగా కూక లేసేవాడు. అయినా చాటునా మాటునా ఎలాగయినా అప్పడిదగ్గరకే పరిగెట్టేవాణ్ణి.
“వాడు మాదిగాడురా దగ్గిర కెడితే స్నానం చెయ్యాలి. నీకు ఒడుగు అయింది కదా. పితృ దేవతలకు గతులు తప్పుతాయి,” అనేవాడు తాతయ్య.
“దూరంగా కూకోండి, అబ్బాయి గారూ, తాతయ్యగారు కోప్పడతారు తప్పు” అనేవాడు అప్పడు.
అప్పడు కుట్టిఇచ్చిన జోళ్లు తొడు క్కుంటే గతులు తప్పని పితృ దేవతలు, అప్పడికి దగ్గిరగా కూర్పుంటే ఎందుకు తప్పుతారో నాకు తెలియలేదు.
నాకు తెలియని చాలా సంగతుల్లో, అప్పడికి డబ్బు ఎలా వస్తోందో, ఆ వచ్చిన డబ్బు సరిపోతోందో లేదో కూడా ఒకటి.
“నీకు డబ్బుందా, అప్పడూ? ”
“బలేవాడివోయ్, కుర్రయ్య!” పక పకా నవ్వేవాడు. “మీరంతా చల్లగా ఉంటే నాకేం లోటు, బాబూ”. వెంటనే అతని ముఖం గంభీరమయ్యేది.
“ఈ జోడు చూడు, బాబూ తొడిగితే చాలదనుకో నిన్ను కరుస్తది. ఎక్కువైందనుకో తుళ్ళి తుళ్ళి పడతావు. అలాగే డబ్బుకూడా. ఒక్క పొట్టకి ఏమాత్రం కావాలి, బాబూ!
చిత్ర మేమిటంటే, నేను ఒకటో క్లాసు సరస్వతీవాచకంలో నేటికి ఇరవై సంవత్సరాల క్రిందట ఏం చదువుకున్నానో నాకు జ్ఞాపకం లేదు. కాని ఇరవై సంవత్సరాల కిందట అప్పడు ఏ రోజున నాకు ఏ పారం చెప్పాడో ఒక్క పొల్లుకూడా పోకుండ నేటికీ నాకు జ్ఞాపకం ఉంది. బడిపంతులు కొట్టి, తిట్టి, ‘అలతల’ అనమనేవాడు. అప్పడు, బాబూ, బాబూ, అంటూనే జీవితాన్ని చదివి చెప్పేవాడు. బడిపంతులు పెద్ద చదువులు చదువుకున్నాడు. అప్పడు ఏమీ చదువుకోలేదు.
ఏమీ చదువుకోని అప్పడి దగ్గర చేరి నేను పాడైపోతున్నానని మా తాతయ్య ఎక్కువ బాధపడ్డాడు. నా భవిష్యత్తూ, బాగూ కోరి ఒకసారి మాత్రం తట్లు తేలేలా కొట్టాడు. అప్పట్నుంచీ నేను అప్పడి దగ్గరికి వెళ్లటం మానేశాను. బళ్లోకి పోతూ కిర్రుచెప్పులు కూడా తొడగటం మా నేశాను. ఎందుకంటే, ఎందుకంటే, ఆ జోళ్లు తొడుక్కొని నేను అప్పుడు కూర్చున్న అరుగు ముందునుంచి పోతూంటే, ఆ జోళ్లే నన్ను అప్పడిముందు నిలబెట్టేవి. అందుక నే ఆ జోళ్లంటే భయపడేవాణ్ణి. ముఖం ఎదటి గోడవైపు తిప్పేసుకొని గుర్రపుదౌడు తీస్తూ అప్పడి ముందునుంచి పరిగెట్టేవాణ్ని. పక్క మలుపు తిరిగి, గోడకి బల్లిలా అంటుకుని వెనక్కి తిరిగిచూసేవాణ్ని. వచ్చినదిక్కుకే చూస్తూ నిశ్చేతనంగా నిలబడి పొయ్యేవాడు అప్పడు.
నేను ఒకరోజున బరినుంచి వస్తోంటే, దారి కడ్డంగా నించొని “అబ్బాయిగారూ, తాతగారు కోప్పడ్డారా?” అన్నాడు. ఆ ఓదార్పు నన్ను చాలా అవమానించింది. పట్టలేక వెక్కి వెక్కి ఏడ్చాను. “ ఎర్రినాయనా, ఎయ్యేళ్లు బతుకు నా తండ్రీ” అని అప్పడు నన్ను దీవించి కళ్లనీళ్లతో వెళ్ళి పోయాడు.
ఇంకొకసారి కొత్తజోళ్లు కుట్టి, “ఇవి తొడుక్కో, బాబూ! పాతవి పోయినట్టున్నాయి !” అన్నాడు. నేను వినిపించుకోకుండా, తప్పించుకు పారిపోయివచ్చేశాను. ఆ రాత్రికే నాకు విపరీతంగా జ్వరం వచ్చేసింది. ఆ తరవాత కొద్దిరోజులకే నేను బస్తీకి వెళ్లిపోయాను.
మేనమామ గారింట్లో “నేను చదువుకున్న పది హేను సంవత్సరాల్లోనూ నేను తిరిగి మా తాతయ్య గారి ఊరు వెళ్లవలసిన అవసరం లేకపోయింది. నేను బస్తీకి వచ్చిన చాలా కొద్దికాలానికే మా తాతయ్య స్వర్గస్థుడయ్యాడు. మా తాతయ్య బాపతు రెండెకరాల
పొలం’ మా మామయ్య కొచ్చింది. నా బాపతు రెండెకరాలు మా మామయ్యే అమ్మి నా చదువుకు ఖర్చు పెట్టాడు.
చదువుసంధ్యలు పూర్తై మళ్లీ ఇరవై సంవత్సరాలకు మా తాతయ్యగారి ఊరు వెళ్లాను. ఆ ఊరు ఊరంతా మారిపోయింది. నా చిన్న నాటి వీధులు గాని, ఆ ఇళ్లు గాని, చిన్నప్పటిలా కచేరీ సావిట్లో కలుసుకోవటం గాని… ఏమీ లేదు. ఒక రైలుస్టేషన్, బస్సుస్టాండు, కాఫీ హోటళ్లు, ‘మేడలు అన్నీ అంతా కొత్తే.
బస్సుదిగి మా స్కూలుపక్క అరుగు మీదకి చూశాను. అక్కడ ఒక రెండం తస్తుల మేడ కనిపించింది. దానికింద గదిలో క్షవరశాల. ఆ ఊరి పని పూర్తి చేసుకొని వెళ్లి పోతూ, ఉండబట్టలేక, అప్పడి గురించి తెలుసుకోవాలని చాలా ప్రయత్నించాను. బస్సుస్టాండు పక్క మేడలో ‘వసంతకాలపు నూతన అలంకారాలు బాటా జోళ్ళు’ అన్న ప్రకటన. అప్పడికీ వసంత కాలానికీ ఏమి సారూప్యాన్ని ఊహించుకోగలను?
నేను వెళ్లవలసిన కారు రాలేదు. ఒక గంట ఆగవలసివచ్చింది. కారు స్టాండు కెదురుగా కాఫీ హోటల్లో ఫలహారంచేసి అపక్క కిళ్లీల్లో మిఠాయికిల్లీ కట్టించుకొంటూ నిలుచున్నాను. ఆపక్క మురికి కాల్వ గట్టున తాటాకు గొడుగుల క్రింద కూర్చుని ఇద్దరు ముగ్గురు మాదిగ వాళ్లు “జోడుకు పాలిస్ చేయమంటారా ? ” అని ఆడిగారు.
ఏమీ ఉబుసుపోక అందులో ముసలాడికి నాజోడు ఇచ్చి పాలిష్ చేయమన్నాను. వాడు జోడు చేత్తో పుచ్చుకొని ఇటూ అటూ తిప్పి, ముఖం చిట్లించి,
“ఇదేం జోడు బాబూ, యదవచర్మం ! కాలం మండిపోతోంది,” అన్నాడు.
పదిహేనురూపాయలు పోసి నేను కొన్న జోడు ఇలా అవమానింపబడటం నాకే అవమానమయింది. దాని ఖరీదు సంగతీ, దాని ప్రశస్తి సంగతీ అంతా చెప్పాను.
“అంతా కుంపినీవోడి మాయండి, ఈ రోజుల్లో మా అయితే రెండు రూపాయలయ్యేను. మా రోజుల్లో కిర్రుజోడు కుట్టి పావలా కిచ్చేవాళ్లం. పాతికేళ్లు మన్నేది. అంతా కలికాలం వచ్చేసింది, బాబూ!”
“ఏమోయి, అప్పడని ఉండేవాడు, చిన్నతనంలో జోళ్లు కుట్టేవాడు. ఏమయ్యాడో తెలుసా?”
“ఆడాండీ…ఎక్కడో చచ్చాడు లెండి, ఏం జస్తేనేఁ! దేనికి లోపం వచ్చినా ఆ రోజుల్లో భుకితికి లోపం ఉండేది కాదండి. ఇప్పటోళ్లకి నాజూకే గాని నాణ్ణెం అక్కర్లేదండి. నాయానికి రోజులు కావండి. ఆ కుర్రాళ్లే ఏరు, ఆ వరసే ఏరు. ఎంకట్రామయ్యగారి మనవ డుండేవాడు అట్టాంటి కుర్రాళ్లే లేరు”
నేను కొయ్యబారిపొయ్యాను. నేనే ఆ మనవణ్ణని చెప్పుకోటానికే సిగ్గేసింది. వాడికి రూపాయ చేతులో పడేసి వాడు చిల్లర పట్టుకు పరుగెత్తుకొస్తుంటే వినిపించుకో కుండా బండిలో పడి, “స్టేషజోకి పోనియ్ వోయ్’ అన్నాను
అప్పడు రాయిలా నిలబడిపొయ్యాడు.
* * *