Stories

కొడిగట్టిన దీపాలు

రచన : రాంషా.

కామేశం వ్రాసిన ఉత్తరాన్ని సరోజ చదువుతోంది….

“నువ్వు లేక పోతే నేను లేనట్టే. దుర్బరమైన నా ఒంటరి జీవితాన్ని తలుచుకొవి కుమిలిపోతూ ఆ అంధకారంలో నువ్వే ఒక్క ఆశాజ్యోతి వనుకుంటున్నాను… నాకు నువ్వుకావాలి… నాకు ఊపిరికావాలని, ప్రాణంకావాలని, జీవం కావాలని ఎంత సహజంగా వాంఛిస్తానో అలాగే నువ్వు కావాలని కూడా….. అవి లేకపోతే నేనెల్లా బతకలేనో నువ్వులేకపోతే కూడా అలానే. ఈచీకట్లో?… ఈ దోమలతో…”

కామేశం వ్రాసిన ప్రతీ అక్షరమూ  అతని గుండెల్లో రగిలిన దుఃఖాన్ని వ్యక్తంచేస్తున్నాయి. కామేశం మోకాళ్ల మీద తల పెట్టుకొని కళ్లనీళ్లు పెట్టుకొన్నట్లు, భోజనం మాని సత్యాగ్రహం చేసి కృశించి పోతున్నట్టు, ఇకనైనా ఆమె తన జవాబుతో ఓదార్చి అతను కోరినట్లుగా లేచిపోక పోతే ఆ అమాయక హృదయం చటుక్కున ఒక్కసారి ఆగిపోనున్నట్టు ఆ అక్షరాలు సరోజకు చెప్పాయి.

సరోజ ఆ ఉత్తరం చెప్పిన మాటలు విని కొంత నవ్వుకొంది; కొంత గర్వపడింది; కొంత జాలిపడింది. ఈ సమస్యను ఎలాగో తేల్చక తప్పదనుకోంది.

ఉత్తరం అడుగున చేవ్రాలు కేసి చూసింది. పేరేమీలేదు. ఆ ఉత్తరం ఎవరు వ్రాశారో తనకు తెలియనిదికాదు; ఇది వరకు అదే దస్తూరి ఉత్తరాలు ఆమె కెన్నో వచ్చాయి.

సరోజ ఆ ఉత్తరాన్ని పట్టుకొని పరధ్యానంగా ఆలోచిస్తూంటే ఆమెభర్త వచ్చాడు. వస్తూనే నాగేంద్రం “ఉత్తరం వచ్చిందా?” అన్నాడు.

ఏదో ఆలోచిస్తూనే సరోజ ఊ అంది, “ఏదీ ఇలాతే ఏదోఆలోచిస్తూన్న సరోజ ఆ ఉత్తరాన్ని భర్తచేతి కందించింది, భర్త యధాలాపంగా అందుకుని ఆమె కేసిచూస్తూ

“ఇంకా తల దువ్వుకోలేదే? అన్నాడు..

సరోజకు అప్పుడే మెళకువవచ్చింది.  భర్త, అతని చేతిలోని ఉత్తరం – రెండూ ఆమె కేసి చూస్తున్నాయి. సరోజ ముఖంచిట్లించుకొని “ఆ ఉత్తరం చూశారా?” అంది.

“ఏం”

ముందు చూడండి. మనిషి జన్మ ఎత్తిన తరవాత బుద్ధి ఉండాలి. బుద్ది లేని తుంటరులికి బుద్ది చెప్పలేని మగాళ్లు ఛస్తే నయం.

ఉత్తరం పూర్తిగా చదివి భర్త కుంచుకున్న కళ్లతో నవ్వాడు, ఎవడో వెర్రివెధవ తన భార్య పాతివ్రత్యాన్ని గ్రహించకుండా తన లుచ్ఛాతనం బైట పెట్టుకున్నాడు.

ఎవరంటావ్?

ఇంకెవరు? ఆ శేషువెధవ. కిటికీలోంచి లోపలికి విసిరేశాడు…. వెర్రివాడి పెళ్లాం వాడకంతా వదినె అని.”

బుద్ది చెప్పిస్తానులే.

ఇంకా మెల్లగా అంటున్నారు! వీపు చితక్కొట్టక, మన ప్రయోజకత్వం ఇలా ఉండబట్టే….”

భర్త ఆ రాత్రి చాలాసేపటి దాకా శేషువెధవని ఎలా శిక్షించటమా అని ఆలోచిస్తున్నాడు. పతివ్రతల జీవితాల్ని, మానధనాన్నీ రచ్చబండ కీడ్చాలని వాళ్ళ ఆశయం కావొచ్చు. రావణున్ని శ్రీరాములు వారు మర్దించినట్టు, కీచకుణ్ణి భీములువారు తాడించినట్లు ఈ కలియుగంలో తను ధర్మసంస్థాపనార్థాయ నడుము బిగించక తప్పదు. ఆ దృఢ సంకల్పంతోనే చివరికి నిద్రపోయేసరికి రాత్రి పన్నెండు దాటి ఉంటుంది.

సరోజ వాసిన ఉత్తరాన్ని కామేశం చదువుతున్నాడు..

….మీరు వ్రాసిన ఉత్తరాన్ని చదివి వెర్రిదానిలా, చంటిపిల్లలా వెక్కి వెక్కి ఏడ్చాను. తలగడ యావత్తూ కన్నీటితో తడిసి పోయింది. చివరికి మావారు కూడా నన్ను ఓదార్చవలసి వచ్చింది. కారణం ఏమిటని ఆయన అడిగాడు. చచ్చిపోయిన మా అమ్మ జ్ఞాపకం వచ్చిందని చెప్పాను. నాతో బాటు ఆయన కూడా ఏడ్చారు. మీరు తెల్లారకట్ట మూడు గంటలకి బండి తెచ్చి వీధిలో ఉంచండి. చడీ చప్పుడూ  లేకుండా బండిలో పడతాను. ఆ తరవాత మీరన్నట్టే కలకత్తాకి…”

ఆ తరవాత సంగతి కామేశానికి తెలుసు. అయితే ఈఉత్తరం పూర్తికాకుండానే కామేశం దుఃఖపడ్డాడు. సరోజగాని, ఆమెభర్తగానీ – ఇద్దరూ గాని ఏడ్చారనికాదు. ఆడవాళ్లకీ ఆడవాళ్ళని ప్రేమించే మగవాళ్లకి” నీళ్లకడవ నెత్తిమీదనే ఉంటుంది. ఆ సంగతి కామేశానికి తెలుసు. అయితే కామేశం బాధల్లా

“… ఈదొంగముండ వస్తానంటోంది సరే. చేతిలో కానీ డబ్బు లేకుండా నా ప్రాణానికి గుది బండలా తయారైతే ఎట్లా? ఉన్న పీడతోనే ఛస్తూంటే ఇదో శనిగ్రహం కూడానా?”

మొన్న మొన్ననే తనకి పుట్టిన కూతురు, ఇంట్లో ఇవి లేవని అవి లేవని అను నిత్యం సాధించే పెళ్ళాము, ఎన్నటికీ ఎదుగూ బొదుగూ లేని ఉద్యోగం అన్నీ కామేశానికి జ్ఞాపకం వచ్చాయి. ఆ జ్ఞాపకంతో కళ్లతడి చేసుకొన్నాడు కామేశం.

సరోజ వ్రాసిన ఉత్తరాన్ని ఆమె భర్త చదువు తున్నాడు. … నేను మిమ్మల్ని విడిచి వెళ్లి పోవలసి వచ్చినందుకు వీచారిస్తున్నాను. మనం గడిపిన ఆరేళల్లోనూ మన దిన చర్యలో మార్పురాకపోవటమే. దానిక్కారణం ఆ వంటిల్లు, పొయ్యి, పడకగది, చదివిన పుస్తకాలే చదవటం, పీల్చినగాలినే విడవటం…ఇవే నాకు దుర్భరాలయ్యాయి. వాటన్నిటినీ మార్చుకోవాలంటే మిమ్మల్ని కూడా మార్చక తప్పలేదు. విశేషమైన ప్రేమతో మిమ్మల్ని విడవలేక విడిచి వెళ్లిపోతున్నాను. మీ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి. వేళ పట్టున భోజనం చేస్తూండండి. చిరుతిళ్లకి దురలవాట్లకి లోనుగాకండి. లోనయితే నామీద ఒట్టు. మీకు నా ముద్దులు.”

ఉత్తరం చదువుకొని ఆమె భర్త అనుకున్నాడు.

“పాపం ఆవెర్రిదానికి నేనంటే ఎంత ప్రేమ: నన్ను విడవలేక ఎంత దిగులు: ఎవడో దొంగ వెధవ ఆవిణ్ణి మోసగించి లాక్కుపోతున్నా కూడా నా మీదనే ప్రాణం పెట్టుకొందీ పాపం, వెర్రిది కాకపోతే తెల్లనివన్నీ పాలూ నల్లనివన్నీ నీళ్లు అనుకుంటుందా? తన వియోగం భరించలేక, ఏ బజారు సరుకు వెంబడో పడి వళ్ళు కుళ్ళబెట్టుకుంటానేమోనని దాని భయం,

అనుకుని ఆ ఆలోచనకి గుండెతరిగి కన్నీళ్లు కార్చాడు. తన ఈ దుఃఖాన్ని ఓదార్చటానికి ఆవిడలేదనీ మరీ దుఃఖ పడ్డాడు. ఆవిడేలేకపోతే ఆవిడ లేచిపోయిన దుఃఖాన్ని తాను ఎవరితో చెప్ప గలడు?

ఆంజనేయులు కామేశం ఉత్తరం చదువు తున్నాడు:

…. ఇవాళ నేను చాలా విపత్తు లో ఉన్నాను. నన్ను ప్రేమించిన ఫలానా వారి భార్య నేటినుంచి నాకు భార్యకాబోతోంది. ఆ అమృత మూర్తి నావియోగం భరించలేక ఏమైనా నాతో కలకత్తా పోతానంటోంది. ఆవిడ దగ్గర డబ్బు పుష్కలంగా ఉంది. కాని, ఎటొచ్చీ కానీ కూడా దగ్గర లేని వాణ్ణి నేనే. ఈదుస్థితిలో మొదటి నాడే ఆవిణ్ణి నేను డబ్బు అడగటం నాకు మంచిదిగా తోచలేదు. అడిగితే ఆవిడ ఏమనుకుంటుందో. అందుకని ఈ ప్రేమ ఆపత్తు సమయంలో నాకు నువ్వొక ఉపకారం చేయాలి. ఒక్క ఏభై రూపాయలు. ఈ నెలాఖరుకి పంపించివేస్తాను. అప్పటికి పాతబడుతుంది కనుక ఆవిడదగ్గర్నుంచి పుచ్చుకోవచ్చు… ఇది నాజీవిత రహస్యం! ఈ రహస్యాన్ని కాపాడగల ఆప్తమిత్రుడివి నువ్వొక్కడివే. ఈ క్షణంలో నువ్వు బదులిచ్చిన మొత్తం నీకు కాఫీ ఖర్చంత. దురవస్థలో ఉన్న ఒక స్నేహితుడికి ఆ మాత్రం నువ్వు చేయక తప్పదు. ఈ సంగతులేమీ నువ్వు సత్యంతో గాని, సుబ్బారావుతో గాని, శేషాద్రితోగాని చెప్పవద్దు. ఆమెనాకు దుర్భరమైనప్పుడు నీ ఆజ్ఞ ప్రకారమే వర్తిస్తాను.”

ఇదేఉత్తరాన్ని, ఆఖర్నున పేర్లలో మార్పులతో సత్యం, శేషాద్రి, సుబ్బారావు గార్లు కూడా పదేసి సార్లు చదువుకున్నారు.

చదువుకొని నల్గురూ నిట్టూర్చారు.. చదువుకోని నల్గురూ తమ ఔదార్యాన్ని ప్రకటించారు. దాని ఫలితం రెండు వందలై కామేశం సపత్నీ సమేతంగా కలకత్తా చేరాడు.

ఆంజనేయులు ఒక్కడూ కూర్చున్నప్పుడు అనుకున్నాడు.

ఒక పందికి పన్నీరుబుడ్డి దొరికింది; ” ఒక మొండి వాడికి. మొగలిపువ్వు దొరికిందీ.

“పోనీ. కాని, ఆ స్థానం లో ఏదీ ఎక్కువ కాలంఉండలేదు. నీరు పల్లానికి ప్రవహించినట్టు, సూర్యుడు తూర్పున ఉదయించినట్టు – ఆఖరికి అంతా సవ్యం కాక తప్పదు.

ఒక్కచచ్చు ఏభైరూపాయలతో ఒక స్త్రీ ప్రియుడి పౌరుషాన్నీ, ఆ స్త్రీ జీవితాన్ని నేను కొనేసినట్టే. లేకపోతే తన్ను మాలిన ధర్మమూ, మొదలుచెడ్డ బేరమూ ఉంటుందా?

ఆంజనేయులు అనుకున్నదే సత్యం అనుకున్నాడు. సత్యం అనుకున్నదే శేషాద్రి అనుకున్నాడు; శేషాద్రి అనుకున్నదే సుబ్బారావు కూడా అనుకున్నాడు.

ఈవిషయంలో ఆ నల్గురూ ఒక్క త్రాటి మీద నడిచారు.

ఆ నల్గురు మిత్రుల మాటా ఏమో కానీ సరోజ వేరొకలా అనుకొంది:

… ఎంతకాలం నూతిలో కప్పలా మగ్గిపోతాను కనుక! మనిషికి విలువలు రావాలంటే ముందు ముఖ్యమైనది డబ్బు. ఆ తరువాత అందం, డబ్బులేని వాళ్ళు అందాన్ని అమ్మి డబ్బు సంపాదించుకోవాలి. డబ్బు సంపాదించుకున్నాక అందాన్నీ ఆనందించవచ్చు. ఈరోజుల్లో డబ్బుకు దగ్గిర దారి సినీమా. దారి పొడుగునా – దుష్టకాలం కనుక – ఒక ఎస్కార్ట్ ఉండాలి. మన కామేశం ఉండనే ఉన్నాడు. సరేచూద్దాం.”

కామేశం వ్రాసిన ఉత్తరాన్ని అతని భార్య చదువుతోంది.

“…ఈపాటికి మన వూళ్ళో ఒక చిన్న గందరగోళం లేచేఉంటుంది. తద్వారా నేను చేసిన అపచారం నీకీ పాటికి తెలిసే ఉంటుంది … నువ్వే చెప్పు ఏంచేయమంటావో. వెధవ జీతం డబ్బులన్నీ నీ రోగాలకీ ‘రొష్టులకీ చాలటం లేదాయే. ఇక సంసారం గడిచేదెట్లా, మనమిద్దరమూ సుఖంగా బ్రతకాలంటే మనకు డబ్బు కావాలి. అప్పనంగా డబ్బు రావాలంటే డబ్బున్న ఆడదిరావాలి. అది వచ్చింది. అంటే వెయ్యిరూపాయలన్న మాట. ఆ డబ్బున్న ఆడది అందమైనదైతే డబ్బున్న స్నేహితులు కూడా వస్తారు. దాని ఫలితం నాలుగు ఏభైలు రెండువందల రూపాయలు. పోగా మామూలు జీతం వంద. మొత్తం పదమూడు వందలు. దాన్ని వదులుకున్నందుకు లంచం ‘రెండు వందలు. మొత్తం పదిహేను వందల ఆదా. నాకు శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ అయింది. నువ్వు పాపాయీ ఈ నెలాఖరుకు రండి. ఖర్చుల నిమిత్తం వందరూపాయలు పంపిస్తున్నాను…. ఉత్తరం మరీ ఆలస్యంగా వ్రాసినందుకు క్షమించు.” ఆ ఉత్తరాన్ని చదువుకొని అతని భార్య నిట్టూర్చింది. ఈ ఉత్తరం ఒక్క రోజు ఆలస్యంగా అంది ఉన్నట్లయితే,  శ్రీనివాసరావు ఆమెకు వ్రాసిన ఉత్తరం పనిచేసిఉండేది.