మూలం : ఛఖోవ్. అనువాదం: రాంషా.
రాత్రి పదిగంటలవుతుంది. డాక్టర్ సదాశివం గారి ఒకే ఒక్కకొడుకు, ఆరేళ్ళ రంగారావు, మసూచి వచ్చి చచ్చిపోయాడు. ఆ పసిబిడ్డడి తల్లి అతని మంచంకోళ్ళ దగ్గర కూర్చుని నిరాశతో సొమ్మసిల్లిపోయింది. అదే సమయాన వీధితలుపు ఎవరో బాదుతున్నారు.
బిడ్డడికి మసూచి వచ్చినప్పట్నుంచీ, డాక్టర్ కనుక, నౌకర్ల నెవళ్ళనీ ఇంటికి రానివ్వటంలేదు. చేతిలో స్టెతస్కోపు అలానే వుంది; సూటింకా విప్పనే లేదు. చెమట్లుకమ్మిన నుదురు తుడుచుకోనన్నా లేదు. అలాగే తిన్నగా వీధితలుపుదగ్గిరికి వెళ్ళాడు. హాలంతా చీకటిగా ఉంది. ఇక ఆ వచ్చిన ఆసామీ ఎత్తుతప్ప ముఖ కవళిక లేమి స్పష్టంగా కనిపించలేదు. పాలిపోయిన ముఖం, ఆ ముఖమే ఆ హాలుకి కాంతి ఇస్తోందా అన్నట్టుంది.
“డాక్టర్ గారున్నా రాండి?” అన్నాడు ఆ వచ్చిన ఆసామీ.
“ఉన్నాను; మీ కేమి కావాలో చెప్పండి” అన్నాడు సదాశివం.
“మీరేనా డాక్టరుగారు?” ఆశ్చర్యం ఆనందం ఒక్క సారి ఆవచ్చిన ఆతనిలో ఉరక వేసి ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఆనందాన్ని పట్టలేక ఆ చీకట్లో తడివి డాక్టర్ చెయ్యిపట్టుకుని ఊపాడు. “నాకు… నాకు… చాలా సంతోషంగా ఉందండి… నేను మిమ్మల్నె గుగుదును. నన్ను మీరు మరచి పోయారను కుంటాను. నా ఆదృష్టంకొద్దీ మీరు దొరికారు. ఏమైనా మీరు తక్షణం బయలుదేరి రావాలి. నాభార్యకి ప్రాణం మీది కొచ్చింది. బండి… జట్కా తీసుకువచ్చాను. ”
ఆ వచ్చిన ఆసామీ కంఠాన్నీ కదలికల్నీ బట్టిచూస్తే నిజంగా కొంపమునిగే దశలో ఉన్నాడని అర్ధమవుతుంది. ఏ పిచ్చికుక్కో తరుముకొచ్చినప్పుడు, లేదా పంచెకి నిప్పంటుకున్నప్పుడు ఎలాంటి అవస్థ పడతాడో అలాగే ఒగరుస్తున్నాడు. గొంతుక వణుకుతోంది. మాట తొట్రుబడుతోంది. అతని మాటల్లో అమాయకత, పిల్లవాడికుండే భయం కనిపిస్తున్నాయి. భయంతో గుండెలు కొట్టుకొనే అందరిలాగే చిన్న చిన్న మాటల్ని అనవసరం మాటల్ని కూడా చెప్పాడు.
“మీరు ఇంటిదగ్గర ఉండరేమో అనుకున్నాను… దారిలో ఎంత బాధ పడ్డామో ! …ముందు బట్టలు వేసుకోండి… ఏం జరిగిందంటే… రామం. కలికి చెర్ల రామాన్ని ఎరుగుదురుకదూ ! వాడొచ్చాడు… ఆ కబురూ ఈ కబురూ మాట్లాడు కుంటున్నాం … కాఫీ తాగుతున్నాం. మా ఆవిడ తలుపు దగ్గిర నిలబడిందల్లా ఒక్క వెర్రికేక వేసి, గుండెలు పట్టుకొని పడిపోయింది… మేమిద్దరమూ తీసి కెళ్ళి మంచం మీద పడేశాం.,. . ముఖం మీద నీళ్ళుజల్లి శైత్యోపచారాలు చేశాను… శవంలా పడి ఉంది… గుండె ఆగిపోయిందేమో!… రండి వెడదాం… వాళ్ల నాన్నకూడా గుండె ఆగి చచ్చిపోయాడు.”
సదాశివం ఏమి మాట్లాడకుండా అలా వింటూ నిలబడి పొయ్యాడు. అతని కిదేమీ అర్ధమయి ఉండదు. ఏదో అరవం వింటూన్నట్టు నిలబడ్డాడు.
“ నా పేరు వెంకట్రావు… మీరు రావాలి” ఆ చీకట్లో సదాశివాన్ని బర బరా లాక్కుపోయేటంతవరకూ వెంకట్రావు తయారయ్యేసరికి ఈ ప్రపంచంలో పడి డాక్టరన్నాడు :
“క్షమించండి… నేను రాలేను… అయిదు నిమిషాల క్రితమే.. నా కొడుకు చచ్చిపొయ్యాడు.”
“నిజం?” వెంకట్రావు గొంతులోంచి మాటరాలేదు.
“అయ్యో యెంత పని జరిగింది! వెధవరోజు, ఈరోజుల్లా ఇలాగే… నా ప్రారబ్ధం… నాఖర్మ యేదో… ముంచుకొస్తోంది.””
వెంకట్రావు తలుపుకి జార్లపడి ఒక్కక్షణం ఆలోచించాడు. వెళ్ళిపోనా, లేక యెలాగైనా డాక్టర్ని లాక్కుపోనా అని సందేహిస్తున్నాడు.
“డాక్టర్ గారూ, మీ స్థితి నాకు అర్థమయింది. ఇలాంటి సమయంలో మీ పీక మీద కూర్చోవలసి వచ్చినందుకు ఎంత బాధపడుతున్నానో! ఏం చెయ్యను చెప్పండి! మీరే ఆలోచించండి! యెవరిదగ్గర కెళ్ళమంటారు? ఈ ఊళ్ళో మీరుతప్ప యింకో డాక్టర్ కూడా లేడు. రండి బాబూ యెలాగో రండి. నాకోసం కాదు… నా భార్య మొహం చూసి…””
నిశ్శబ్దం నిలువు కాళ్ల నించుంది. సదాశివం వెంకట్రావుకి వీపుతిప్పి, ఒక్క నిముషం కదలకుండా నించుని, మెల్ల మెల్లగా ఒక్కొక్క అడుగే వేసుకొంటూ లోపలి కెళ్ళాడు. బుద్ధి స్థిమితం లేకుండా, యంత్రంలా నడిచి గదిలో మసిబారిన దీపం ముందు, వలంపాటి పుస్తకంతీసి, శూన్యంలోకిచూస్తూ, పేజీలు తిప్పి మూసి వేసిన అతని పద్ధతినిబట్టి చూస్తే ఆక్షణంలో అతనికే విధమైన ప్రయోజనం కాని, వాంఛగాని, కనీసం ఆలోచనగాని ఉండిఉండదనీ, బహుశా తనకోసం హాలులో ఒక మనిషి యెదురు చూస్తున్నాడన్న జ్ఞాపకం కూడా లేదని అర్థమౌతుంది. అక్కణ్నుంచి దాని పక్కగదిలోకి వెడుతూ, తనజీవితంలో తొలిసారి ఆ గదిలోకి ప్రవేశించినట్లు కాలు యెత్తెత్తి వేస్తూ, తలుపులుకోసం తడుముకొన్నాడు. ఆ స్థితిలో అతన్ని చూస్తే నిజవిషయం తెలియనివాళ్ళకి అతను తాగాడా అనిపిస్తుంది…. డాక్టర్ ఒక టేబిల్ ముందు కుర్చీలో కూలబడ్డాడు. కాస్సేపు చేతులమీద తలమోపుకొని, జుట్టుపీక్కొని మళ్ళీ లేచి పడకగదిలోకి వెళ్ళాడు.
పడకగదిని గంభీరమైన నిశ్శబ్దం పరిపాలిస్తోంది. ఆ గదిలోని ప్రతీవస్తువూ అతని దీనావస్థని అనుభవిస్తూన్న ట్లే ఉంది. గదినిండా దీపం వెలుతురు. మంచం పక్క గడ్డిమీద, సగం తెరిచిన కళ్ళతో రంగారావు శాశ్వతనిద్రలో ఉన్నాడు. ఎక్కడా చలనంలేదు. అయినా అనుక్షణమూ అతని తెరిచిన కళ్ళు అంతకంతకి నల్లబడి పుర్రె లోకి దించుకుపోతున్నాయి. ఆ బిడ్డడి శరీరం మీద చేతులు పెట్టి, ముఖాన్ని ఆ బొంతలో దాచుకొని, వాడితల్లి శోషవొచ్చి అక్కడే పడుంది. పిల్లవాడిలాగే ఆమె కూడా చలించటం లేదు తన శరీరాన్నంతనీ ఆ మంచానికి గట్టిగా ఒత్తిపట్టింది. ఆమె అలిసిన శరీరానికి అంత సుఖప్రదమైన పడకతీరు ఆ జన్మకింక పొందలేనన్నట్టు, అంత చక్కని శ్మశానశాంతిని తాను పొందలేనన్నట్లు, అతి కాపీనంతో అలాగే ఆ శవాన్ని అంటి పెటుకుపోయింది. దుప్పట్లు, బట్టలు, బేసిన్లు, చెంచాలు, మందుల సీసాలు అన్నీ అక్కడే చిందర వందరగా పడున్నాయి. వేటిలోనూ ప్రాణం ఉన్నట్టులేదు.
భార్య దగ్గర నిలబడి, ట్రౌజర్ జేబుల్లో చేతులు పెట్టుకొని, తల ఒరిగించి, కుర్రాడికేసి చూశాడు. అతని ముఖంలో విరక్తి కనిపించింది. అయితే గెడ్డం కొసనుంచి ఇప్పుడిప్పుడే కన్నీటి చుక్కలు రాలుతున్నట్టున్నాయి.
మృత్యువు పేరు చెప్పేసరికి మన గుండెల్లో కలిగే అదుటు మాత్రం ఆగదిలో లేదు. ఆ తల్లి మౌనముద్ర, ఆ తండ్రి గుండెల్లో మండే అగ్ని మానవ శోకంలో ఉండే విషాద సౌందర్యాన్ని ద్యోతకం చేస్తున్నాయి. దానిని అర్ధం చేసుకోడానికీ, వర్ణించటానికీ మనుషుల తరం కాదేమో! ఒక్క సంగీతానికే అది చేతనవుతుంది. ఆ కఠిన నిశ్శబ్దంలో కూడా సౌందర్యం గోచరించింది. సదాశివం కాని, అతని భార్యకాని ఏడ్వలేదు. ఆ పరిస్థితిలోని కవిత్వం వారి కర్ధమయిందేమో మరి? వారి యౌవన వసంతం వెళ్లిపోయి ఈ ఒకే ఒక్క ఫలాన్ని ప్రసాదించింది. ఇంక ఆ జీవితాలకి వసంతం మళ్ళీరాదు. ఆ వసంత ఫలం కూడా ఇప్పుడు రాలిపోయింది. డాక్టర్ కి నలభయ్యో పడి నడుస్తోంది. జుట్టు నెరిసిపోయింది. ముసలి తనం కొట్ట వచ్చినట్టు కనిపిస్తోంది. భార్య అనారోగ్యురాలు. రంగారావు వారి ఒకే ఒక్క కొడుకే కాక ఆఖరి కొడుకు కూడాను.
డాక్టర్, భార్య తత్వానికి వ్యతిరేకి. ఆత్మ దుఃఖిస్తూన్నప్పుడు శరీరం చలిస్తేనేగాని తీరదు కొందరికి. ఆరకంవాడు డాక్టరు. ఒక అయిదు నిమిషాలపాటు అక్కడే నిలబడి కాళ్ళు ఎత్తెత్తివేస్తూ పడకగదిలోంచి పక్క గదిలోకి వెళ్ళాడు. అక్కడనుంచి వంటింట్లోకి, అక్కడ కాసేపు అటూ ఇటూ తిరిగి సందు గుమ్మం లోంచి మళ్ళీ హాలులోకి వచ్చాడు.
మళ్ళీ పాలిపోయిన ముఖం ఎదురయింది.
“అమ్మయ్యా” నిట్టూర్చాడు వెంకట్రావు. తలుపు కమ్ములు పట్టుకుని “రండి బాబూ వెడదాము” అన్నాడు.
ఆమాటకి సదాశివం తృళ్ళిపడి ఒక్కక్షణం నిదానంగా చూసి జ్ఞాపకం తెచ్చుకొన్నాడు.
“నేను ఇందాక నే మీతో రానని చెప్పానుకదా; మీకు మతిపోయిందా?”
“డాక్టరుగారూ, నేను కూడా మనిషినే; రాక్షసిని కాను. నాకూ రక్తమాంసాలున్నాయి. మీ స్థితి నా కర్థమవుతుంది. మీ అవస్థకి జాలిపడుతున్నాను” వెంకట్రావు గొంతుకను ఆదోలామార్చి అన్నాడు. “కాని నా భార్య చచ్చిపోతోంది. ఆమె పెట్టిన గావుకేక మీరువిని ఆ సమయంలో ఆమె ముఖాన్ని చూచివుంటే నా బాధ మీకర్థమై వుండేది. ఓరిదేవుడా మీరు బట్టలు మార్చుకోటాని కెళ్ళారనుకున్నాను. ఒక్క క్షణం ఆలస్యమైతే మందికాదు. మీ కాళ్ళు పట్టుకుంటాను; బైలుదేరండి.”
“నేను రాలేను.” ఒక్క క్షణం సందేహించి డాక్టరన్నాడు. అంటోనే పక్కగదిలోకి వెళ్ళిపోయాడు.
వెంకట్రావు వెంటబడి డాక్టరు చెయ్యి పట్టుకొన్నాడు,
“మీరు దుఃఖంలో ఉన్నారు. నాకు తెలుసు. మిమ్మల్ని పిప్పిపన్ను బాధ కమో, కోర్టులో సాక్ష్యానికనో ఒత్తిడి చేయటంలేదు. ఒక మానవప్రాణిని కాపాడమని కాళ్ళావేళ్ళా పడుతున్నాను.” ఒక ముషివాడికంటే కనిష్టంగా తయారయ్యాడు వెంకట్రావు, “ఒక వ్యక్తిగత దుఃఖంకంటే ప్రాణం అమూల్యమైనది. ధైర్యం తెచ్చుకోండి. సాహసించండి, మానవత్వంకోసం మీ దుఃఖాన్నంతా మరిచిపోండి.”
“మానవత్వం రెండువైపులా పదునున్న కత్తి.” కోపంతో అన్నాడు డాక్టర్ “ఆ మానవత్వం పేరుతోనే నన్ను లాక్కు పోవద్దని ఏడుస్తున్నాను. ఓరి నాయనా, యిదెక్కడి గొడవ! నా కాళ్ళు గజగజ లాడుతున్నాయి. మానవత్వం పేరుచెప్పి నన్ను భయ పెడుతున్నారు. ఇప్పుడు నేనేమీ చెయ్యలేను; యెక్కడికీ కదల్లేను. నాభార్యని ఈ స్థితిలో ఎవరికప్పజెప్పను? వీల్లేదు. నేను రాను గాక రాను.”
సదాశివం పట్టు విడపించుకొని రెండడుగులు లోపలికి వేశాడు.
“మీ కాళ్ళని పడతాను. మీ కడుపున పుడతాను; నన్ను రమ్మనకండి నన్ను చంపేసినా సరే నేను రాను.””
“తమరట్లా మాట్లాడటం భావ్యంగాలేదు.” అంటూనే వెంకట్రావు డాక్టర్ గారి చేతులు పట్టుకున్నాడు. “మిమ్మల్ని చంపితే నాకేమొచ్చింది? మీరు రావాలని వుంటే రండి. మీరు రాకపోతే పోనీలెండి. పట్టుమని పాతికేళ్ళన్నా లేని యువతి ఒకామె చచ్చిపోతోంది, మీ కొడుకు పొయ్యాడని ఇప్పుడేగా మీరు చెప్పారు. మీ కంటే నా దుఃఖాన్ని ఎవరు బాగా అర్థంచేసుకోగలరు ?”
వెంకట్రావు కంఠం గాద్గదిక మైంది. అతని మాటలకంటే అతనితీరు, గొంతుక హృదయాన్ని కుదిపివేస్తున్నాయి. వెంకట్రావు ఆత్మశుద్ధిగానే అన్నాడు. కాని అతను వాడిన ప్రతిమాటా కఠినంగా, నిర్దాక్షిణ్యంగా ఉండి డాక్టర్ చుట్టూతా ఉన్న దుఃఖభూయిష్ట వాతావరణాన్ని కలుషితం చేసింది. నిజానికి అంటీ ముట్టనట్టు నటించేవారికి ఎంత గంభీరమైన, అందమైన మాటలైనా ఒకటే. గొప్ప సౌఖ్యంలో గాని గొప్ప దుఃఖంలో గాని ఉన్న వాళ్ళ హృదయాన్ని అవి స్పర్శించలేవు. ఎందు కంటే సౌఖ్యంగాని, దుఃఖంగాని మౌనాన్నే ఆశ్రయిస్తాయి. ప్రియులు మౌనముద్ర పొందినకొద్దీ పరస్పరం గొప్పగా అర్థంచేసుకోగలరు. అయితే స్మశానస్థ వైరాగ్యం మాత్రం కర్మ చేసేవాడికి తప్ప తతిమ్మా అందరికీ ఓదార్పు నిస్తుంది.
డాక్టర్ అలాగే నిలబడి మౌనం దాల్చాడు. డాక్టర్ వృత్తిలోని ఔన్నత్యాన్నీ, అందులో ఇమిడి ఉన్న స్వార్ధ త్యాగాన్ని వివరిస్తూ వెంకట్రావు ఉపన్యసించిన తరువాత డాక్టరు చుర్రుమన్నాడు.
“ఎంత దూరం !! ”
“ఐదారు మైళ్ళు డాక్టర్. ఒక్క గంటలో వెళ్ళి రావచ్చు. ఒక్క గంటే! గంటే డాక్టరుగారూ”
ఈ ఆఖరు మాటలు వెంకట్రావు చెప్పిన మానవత్వంగాని, స్వార్ధత్వంగాని వైద్యవృత్తిలో ఉన్న ఔన్నత్యంగాని చెయ్యలేని పని చేశాయి. ఒక్క క్షణం ఆలోచించి నిట్టూర్చి, “సరేపద” అన్నాడు.
తొందరగా లోపలికెళ్ళి వెంటనే బ్యాగ్ తీసుకుని వచ్చాడు. వెంకట్రావు సంతోషానికి పరిమితంలేదు. ఆ బ్యాగ్ పట్టుకుని బయటికి పరుగెత్తాడు. బైట అంతటా చీకటి. అయితే హాలులో కంటే వెలుతురుగానే ఉంది. బండిలో కూర్చుంటూ వెంకట్రావు అభినందించాడు. “డాక్టరుగారూ మీ రుణాన్ని తీర్చుకోలేను. ఒరేయ్, పోనియ్‌రా బండి!
బండి హుడాములు వేసుకొంటూ వెళ్ళి పోతోంది. ఇళ్ళ వరసలు రెండు వైపునా పరుగెడు తున్నాయి. కొంత దూరం సాగేసరికి చుట్టూ చెట్లు తప్ప ఇంకేమీ లేవు. కీచురాళ్లు డాక్టర్ కొడుకు చచ్చిపోయిన కథా, వెంకట్రావు భార్య జబ్బుపడ్డ కదా తెలిసినట్టు రోదిస్తున్నాయి. దారిలో ఎక్కడా డాక్టర్ గాని వెంక ట్రావు గాని మాట్లాడలేదు. ఒక్కసారి మాత్రం వెంకట్రావు “ఆత్మీయులకి ప్రాణం మీద కొస్తే నే గాని ప్రేమ పుట్టుకురాదు కాబోలు” అన్నాడు. మరికొంత దూరం వెళ్ళాక డాక్టర్ తృళ్ళిపడి “నన్ను వెళ్ళిపోనీ; మా ఆవిడ ఒకతీ ఉంది. కనీసం నౌఖర్నైనా పంపాలి.” అన్నాడు.
వెంకట్రావు మాట్లాడ లేదు. ఆకాశం మౌనంగా ఉంది. చెట్లు నిశ్చలంగా ఉన్నాయి. ప్రకృతి యావత్తూ నిరాశలో నిమగ్నమైనట్టుంది. వెంకట్రావు ఇల్లు దగ్గిర పడ్డకొద్ది ఆవేదన పడసాగేడు. డాక్టరు దారిపొడుగునా ముక్కుతూనే ఉన్నాడు. చివరికి బండి గుమ్మం ముందు ఆగింది.
“ఏదైనా జరిగిందంటే మాత్రం నేనింక బతకలేను. ” హాలులోకి నడుస్తూ వెంకట్రావు నిశ్చయించు కొన్నాడు. అంతా నిశ్శబ్దంగానే ఉంది. “ అంతా బాగానే ఉందను కుంటాను” నిశ్శబ్దాన్ని వింటూ వెంకట్రావు అనుకున్నాడు.
ఆ హాలులో కంఠాలు గాని అడుగులు కాని వినబడలేదు. ఆ ఇల్లంతా నిద్ర పోతూన్నట్టుంది. దీపాలు గివ్వెటీలల్లా వెలుగుతున్నాయి. ఇప్పుడే డాక్టరూ, వెంక ట్రావూ ఒకరి ముఖాలొకళ్లు స్పష్టంగా చూసుకోగలిగారు.
“ఎక్కడా చడీచప్పుడూ లేదు. బహుశా అంతా సవ్యంగానే ఉండాలి” తనలో తనే అనుకొంటూ డాక్టర్ని వెంటబెట్టుకొని హాల్లోకి వచ్చాడు.
“అయ్యా ఇక్కడ కూర్చోండి, ఒక్క నిమిషంలో లోపలికెళ్ళి చూసి వస్తాను.”
డాక్టర్ ఒక్కడూ కూర్చున్నాడు. గదిలో గడియారం చప్పుడు తప్ప ఇంకేదీ వినిపించటం లేదు. ఎక్కడో దూరంగా ఉన్నగదిలో మాత్రం “ఆయ్యో” అన్న కేక మాత్రం వినిపించింది. ఒక తలుపు మూసిన చప్పుడు మాత్రం స్పష్టమయింది. అంతే, మళ్ళీ నిశ్శబ్దం. డాక్టర్ అలాగే వెంకట్రావు వెళ్ళిన గది కేసి చూస్తూ కూర్చున్నాడు.
వెంకట్రావు తలుపుకి జేర్లబడి నించున్నాడు. గదిలోకి వెడుతున్నప్పటి ఆనందం గాని సంతృప్తి గానీ అతని ముఖంలో లేదు. భయమో పేగులు నమిలే శారీరిక బాధో ఎదో ఆస్పష్టంగా ఉంది. అతని ముక్కూ, పెదవులు, మీసాలు అన్నీ అతని ముఖాన్నుంచి ఊడి పడాలని ప్రయత్నిస్తున్నట్టు కదులు తున్నాయి. బాధతో అతని కళ్లు నవ్వుతూన్నట్లున్నాయి.
గదిలోకి నిర్జీవంగా కదిలి ఆవేశం తెచ్చుకొని “దొంగముండ దగా చేసింది. రామంతో పారిపోవటం కోసం దొంగ జబ్బు నటించింది. ఓరి దేవుడా! ” అన్నాడు. వెంకట్రావు డాక్టరు వైపు నడుస్తూ పిడికిలి బిగించి పళ్ళు గిటకరించి మళ్ళీ తనను తానే ప్రశ్నించు కొన్నాడు.
కూడింది?
“దొంగముండ పారిపోయిందా? ఎందుకబద్ధమాడింది? ఎందుకబద్ధమాడింది? యెందుకిలా మోసం చెయ్యాలి?”
గా
కన్నీళ్ళు వరదలా కారుతున్నాయి. తిన్నగా హాలులోకి వెళ్ళాడు. మనిషి ముఖం ఆకొన్న సింహంలా ఉంది. డాక్టరు ముఖంలో ఆదుర్దా హెచ్చింది. లేచి నుంచుని
“రోగెక్కడ?” అన్నాడు.
“ఇంకెక్కడ రోగి” వెంకట్రావు నవ్వాడు; ఏడ్చాడు. “దొంగజబ్బు… దొంగముండ … వెధవ ఎత్తెత్తింది. ఆ దొంగ వెధవని తీసుకుపారిపోయింది. అది చచ్చినా బాగుండిపోను.. ఏంచెయ్యను ? ఎలాభరించను ?”
డాక్టర్ కళ్ళల్లో నీళ్ళుతిరిగాయి. కాళ్ళు వణుకుతున్నాయ్ డాక్టర్ కి.
“ఏమిటిది ? వెంక ట్రావు కేసి చూశాడు. “నా కొడుకుపోయాడు. భార్య దుఃఖంతో ఒక్కర్తి పడిఉంది. మూడురాత్రుళ్ళునించి నిద్రలేదు నాకు. ఈ నాటకంలో రంగ సామాగ్రిపాత్రని ఆడవలసివచ్చిందా? నా కర్థం కావటం లేదు. ”
వెంకట్రావు ఒక కాయితాన్ని చేతిలోంచి విసిరి తొక్కుతూ “గుడ్డి వెధవని. కళ్ళుమూసుకుపోయి ఏడ్చాను. రోజూ ఆ దొంగ వెధవ ఎందుకు వస్తున్నాడో గ్రహించలేకపోయాను. ఇవేళ బండికూడా ఎందుకు కట్టించుకొచ్చాడో తెలుసుకో లేకపోయాను. – గుడ్డి వెధవని !
“నాకు… నా కర్ధంకావటంలేదు.ఏమిటిదంతా? నా దుఃఖానికి ఒక్క అనునయ వాక్యం లేక పోతేపోనీ, నాదుఃఖాన్ని పరిహసించటమా? నా ముఖం ముందే నవ్వటమా? నన్ను పిల్చి అవమానం చెయ్యటమా?… నాజీవితంలో ఇలాంటిది జరగలేదు.” అన్నాడు డాక్టర్.
ఎవరో తనను వెక్కిరించినట్టు, ఎవరో తనని అవమానించినట్టు భావించి కుర్చీలో మళ్ళీ చతికిల బడ్డాడు సదాశివం.
“నన్ను ప్రేమించక పోతేపోనీ. ఇంకొకణ్ణి ప్రేమించింది. మరీ మంచిది. ఎందుకిలా చెయ్యాలి ? మోసం ఎందుకంట వెంకట్రావు శూన్యాన్ని కంఠంలో కన్నీళ్ళతో ప్రశ్నించాడు. “డాక్టర్ గారూ మీ కేం అపకారం చేశాను? మీరు బలవంతంగా నా దుస్థితికి సాక్షులయ్యారు. మీ దగ్గిర నిజం దాచను. ప్రమాణకంగా చెప్తున్నాను. నేనామెని ప్రేమించాను. బానిసలా ఎంతో భక్తితో ప్రేమించాను. సర్వస్వాన్నీ ఆమె కోసం త్యాగం చేశాను. నా కుటుంబాన్నీ నా ఉద్యోగాన్నీ అన్నీ ఆమెకి ధారపోశాను. ఎలాంటి ఘోరమైన తప్పులున్నా క్షమించాను. ఒక్క సారి కూడా కోపంగా చూడలేదు. ఎందుకబద్ధమాడాలో చెప్పండి… నేను ఆమె నుంచి ప్రేమను ఆశించలేదు; ఎందుకీ మోసం చెప్పండి? మీరు కొయ్యలా కూర్చున్నారు; ఒక్క మాటకూడా ఆడ రేఁ? నా దుస్థితి మీ కర్దం కావటం లేదా?”
కళ్ళళ్ళో నీళ్ళతో, నిలువెల్లా వణుకుతూ వెంకట్రావు డాక్టర్ ముందు తన హృదయం విప్పి పెట్టాడు. రెండు చేతులా గుండెల్ని అదుముకొని ఉద్రేకంతో చెప్పుకొన్నాడు, ఎక్కడా సందేహం లేకుండా తన కుటుంబరహస్యాలన్నీ చెప్పుకొన్నాడు. ఆ దుఃఖభారాన్ని, తను అలాగే ఒక గంటో గంటన్నరో చెప్పుకోగలిగితే, సులువుగా తొలగించుకోగలుగును.
ఆ మాటల్ని డాక్టర్ విని, ఒక్క సానుభూతి వాక్యం పలికిఉన్నట్లయితే ‘వెంకట్రావు దుఃఖం వెంటనే తొలగిపోతుందా అనేది వేరే ప్రశ్న. కాని అలా జరగలేదు. వెంకట్రావు మాట్లాడుతూంటే సదాశివం ముఖం మారిపోయింది. కళ్ళు కోపంతో చింతనిప్పుల్లా అయ్యాయి. వెంకట్రావు అతని భార్య ఫోటో తెచ్చి, అందులోని ఆమె అమాయకముఖాన్ని చూపిస్తూ, ‘అలాంటి స్త్రీ అబద్ధమాడగలదని ఎలా నమ్మేద’ని ప్రశ్నిస్తూంటే డాక్టరు చటుక్కున లేచి
“నీ సోదంతా యెవడిక్కావాలి? నేను వినదలుచుకోలేదు. నేను వినను. అని గట్టిగా అర్చాడు. “నీ వెధవ రహస్యాలన్నీ నాకఖ్కర్లేదు. వాటితో నువ్వే చావు. నీ గొడవలన్నీ నాతో చెప్పద్దు. నాకీ అవమానం చాలదా ? నేనేమన్నా ప్లీడర్ ననుకున్నావా ? ”
వెంకట్రావు తెల్లబోయి సదాశివం కేసి చూశాడు.
“నన్నెఁదుకు తీసుకొచ్చావ్?” డాక్టరు కోపాన్ని ఆపుకోలేక పోయాడు. “నీ ప్రేమ, నీ ప్రణయం, నీ వియోగం, నీ శ్రాద్ధం యెవడిక్కావాలి? నీ సోదంతా నా కెందుకు ? పెద్ద మానవత్వం కబుర్లతో కదంతొక్కుతున్నావ్! నిజమైన మనిషిని గౌరవించటం చేత కాకపోతే కనీసం అతనిజోలికెళ్ళకు. ”
“అంటే?” వెంకట్రావు సిగ్గుపడ్డాడు.
“అంటేనా, మనిషి దగ్గర దొంగనాటకాలాడటం సిగ్గుచేటంటాను. నేను డాక్టర్ని. డాక్టర్లు, మేధావులు అంతా నీ అడుగులకు మడుగులొత్తాలని నీఅభిప్రాయం కాబోలు..
“మీ ఇష్టంవచ్చినట్టు మాట్లాడకండి” వెంకట్రావు కోపం ఉద్రేకించింది.
“లేకపోతే ఏమిటీ నీ వేషం ? నేను పుట్టెడు దుఃఖంలో మునిగి ఏడుస్తూంటే నీ చెత్త గొడవ వినిపించటానికని ఇట్లా తీసుకొస్తావా? ఇతరుల దుఃఖాన్ని వెక్కిరించే అధికారం నీ కెవరిచ్చారు?”
“నీకు పిచ్చెత్తింది. నీలో దాక్షిణ్యం లేదు. నేను కూడా పుట్టెడు దుఃఖంలో
“దుఃఖంట దుఃఖం!” డాక్టర్ వెక్కిరింతగా నవ్వాడు. “ఆ మాట మాత్రం వాడకు. ఆ ఆధికారం నీకు లేదు. తాగుడు దొరకని వేలాది వెధవలు కూడా ఆదే మాట వాడతారు. కొవ్వు తగ్గిన పందికూడా దుఃఖంతో నే ఉంటుంది. ఫూల్ ”
“అయ్యా, మిమ్మల్ని మీరు మరిచిపోతున్నారు వెంకట్రావు గర్జించాడు. “అలా మాట్లాడిన యెంతమందికో వీపు శుద్ధి అయింది. తెలిసిందాండి?”
వెంకట్రావు జేబులోంచి పర్స్ తీసి మూడు పదిరూపాయల నోట్లు అతని ముందుకు విసిరాడు..
“ఇదిగో మీ ఫీజు. ఇంక మీ పని అయిపోయింది. ” ముక్కు శోణాలెగ రేశాడు ‘వెంకట్రావు.
“ఇంకా డబ్బుకూడా ఇస్తున్నావా? నువ్వు చేసిన అవమానాన్ని డబ్బుతో కొనెయ్యాలనుకుంటున్నావా? డాక్టరు ఆ కాయితాల్ని నలిపి దూరంగా విసిరేశాడు.
వెంకట్రావూ డాక్టరూ ఒకరి ముఖాని కొకరు ఎదురుగా బిగించిన పిడికిళ్ళతో నించున్నారు. ఒకళ్ళ నొకళ్ళు అనరాని మాటలనుకున్నారు. వాళ్ళ జీవితంలో ఇద్దరికీ యెన్నడూ ఇలాంటి సంఘటన తటస్థం కాలేదు. ఇద్దరిలోనూ దుఃఖంలోని స్వార్థగుణం తీవ్రంగా పని చేయసాగింది. దుఃఖభాగుల్లో స్వార్థం, కుళ్ళు, కుట్ర, విపరీతంగా పనిచేస్తాయి. అందరూ వట్టి మూర్ఖులనే అభిప్రాయం వ్యాపిస్తుంది. దుఃఖం జనాన్ని కలపలేదు; పోగా విడదీస్తుంది. దుఃఖితుల కులాన్ని ఐక్యపరచే ప్రయత్నంలో, సంతుష్టుల్ని ఐక్యపరచే ప్రయత్నంలో కంటే కొన్ని రెట్లు ఇబ్బందులకు గురి కాక తప్పదు.
“దయచేసి నన్ను పంపించండి” ఆఖరికి డాక్టరన్నాడు.
‘వెంకట్రావు బంట్రోతును పిలిచి పిలిచి విసిగిపోయాడు. ఇంతలోకి బంట్రోతు తయారయ్యాడు.
“ఎక్కడికి పోయావురా దొంగలం … ” పిడికిలి బిగించి మీదకి దూకాడు వెంకట్రావు. మళ్ళీ తమాయించుకొని “పోయి బండితీసుకురా. రేపట్నుంచి ఒక్క వెధవకూడా పనిలోకి రాకండి. దొంగలం… ”
డాక్టరూ, వెంకట్రావూ బండికోసం ఎదురుచూస్తుంటే వెంకట్రావుకి కొంత సంతృప్తికలిగింది. గదంతా చిందులు తొక్కుతున్నాడు. ఏదో దురాలోచన వచ్చి ఉంటుంది. అతనికోపం ఇంకా చల్లారలేదు. తన శత్రువింకా అక్కడ లేనట్టే నటిస్తున్నాడు. డాక్టర్ వెంకట్రావు ముఖంలోకి చాలా అసహ్యంతో చూస్తున్నాడు. ఆనందమూ, అదృష్టమూ ఎదురైనప్పుడు దుఃఖ భాగులు చూసే చూపది.
మరుక్షణంలో డాక్టర్ బండిలో కూర్చున్నాడు. బండి కదిలింది. బండి గాఢాంధకారంలో సాగిపోతోంది. తెలతెల్లవారుతోంది. అప్పుడే కాకులు కూస్తున్నాయి.
దారి పొడుగునా సదాశివం, తనభార్య గురించిగాని, కొడుకు గురించిగాని ఆలోచించలేదు. వెంట్రావుని గురించీ అతని ఇల్లాలిని గురించీ ఆలోచించాడు. అతని ఆలోచనల్లో ఆన్యాయం, రాక్షసత్వం, క్రౌర్యం గూడుకట్టు కొన్నాయి. వెంకట్రావుకీ, అతని భార్యకీ, ఆమెను లేవ దీసుకుపోయినవాడికీ ఉరిశిక్ష వేశాడు డాక్టర్. దారి పొడుగునా వాళ్లని అసహ్యించు కొంటూనే ఉన్నాడు. వాళ్ళమీద అతనికేర్పడ్డ అభిప్రాయం ఆ జీవితంలో ఇంక చెరగదు.
కాలం గతించి పోతుంది; అలాగే సదాశివం దుఃఖం కూడా. కాని, మానవ హృదయానికి తగని అన్యాయమైన ఆ దురభిప్రాయం మాత్రం గతించదు. ఆ పుర్రెలో పుట్టిన బుద్ధి ఇంక పుడకల్లోనే పొయ్యేది.