కథానికః ఆంధ్ర పత్రిక – సచిత్రవారపత్రిక 16-5-1951.
ఉండి ఉండి ఖమ్మం మెట్టు కాని స్టేబుల్ బుర్రలోబుద్ధి వక్రించి పెంపొందటం ప్రారంభించింది.
అన్నీ కలుపుకొని నెలకి సుమారు ఏభై రూపాయల అధికార వేతనంతో ఎవడూ కానిస్టేబుల్ కాలేడని అతగాడు విశ్వసించటం ప్రారంభించాడు. ధర్మంగా తన డ్యూటీ పూర్తి చేసుకొంటే జూదగాడి నుంచి గజదొంగదాకా బుర్ర నిబట్టి ఒకటి నుంచి పదిరూపాయలదాకా భత్యం దొరక్క పోదు. అయితే ఆది కష్టానికి తగ్గ ఫలం మాత్రం కాదు. ఇంక ఎటొచ్చీ సాధారణంగా అందరికీ కనిపించే ఇద్దరెక్కిన సైకిళ్లు, రాంగు సైడు కార్లు, లైసెన్సు లేని కండక్టర్లు, దీపాలు లేని జట్కాలు ఇవి ఉన్నాయి. వీటివల్ల తను ఎంత కక్కూర్తిపడ్డా పావలా కిట్టేను, ఆరణాలు కిట్టేను, పోనీ అవన్నీ జమ కట్టుకున్నా నెలకో పదిరూపాయలకు మించదు’ పోతే సమ్మెకట్టి సాధించగలననే నమ్మకంకూడా అతనికి లేదు.
వాతావరణం అంతా ఇంత నిస్పృహగా ఉన్న సమయంలో ఆశాకిరణంలా దుండగీండ్ర ముఠా ఒక్క టే కనిపిస్తోంది. కింద నుంచి విూద దాకా, వాళ్ల వాళ్ల స్థాయిని బట్టి రెండువందలనుంచి రెండు వేలదాకా ఖరీదు చేసే బుర్రలు కూడా ఉన్నాయి. కనుక తమ తమ జిల్లాలలో రగుల్కొన్న కల్లోలం పోలీసువారికి అసాధారణమైన అధికారాలతో బాటు, అసాధారణమైన అదృష్టాన్ని కూడా ప్రసాదించింది. అదృష్టమయితే గుమ్మం ముందుకొచ్చింది కాని, అనుభవించటానికి కొన్ని అవకాశాలు కూడా కావాలి. ఈ అదృష్టదేవత ఎవర్ని వరిస్తుందో తెలియక పోలీసుల్లో ఎవరి వారే పోటీ పడుతున్నారు.
అయినా వ్యాపారం అంత లాభసాటిగా లేదు. స్థానిక పోలీసు వారికి అష్టమస్థానంలో శని ఉండటంవల్ల కావచ్చు అప్పటికే కొత్త సైన్యాలు ఒక ఊపు ఊపి పంట పొలాల సన్నింటినీ తుడిచిపెట్టుకు పోయాయి. కుంచెడు బియ్యంనుంచి కోడి పెట్టలదాకా రిజర్వు పోలీసులకు మామూలైపోగా, బుర్రని బట్టి పాతిక నుంచి నూట పదహార్ల దాకా వసూలు చేసి కొందరు పెద్దలూ. మరికొందరు గెజిటెడ్ ఆఫీసర్లూ పాప పరిహారపత్రాలిచ్చి తోక క్షణాయించారు. ఈ పెద్దలు బస్తీలకీ, ఆఫీసర్లు మన్యాలకీ బదిలీ అయ్యేసరికి – కలుపు మొక్కల ఏరివేతకూడా పూర్తి కావొచ్చింది. అప్పటికే కటకటాలు కూడా కట కట లాడిపోతున్నాయి.
అయినా ఇంకా ఈ దుండగీండ్రలో కొన్ని పెంకిఘటాలు ఎలాగో ఎక్కడో దాంకునే గడుపుతున్నాయి. కానిస్టేబుల్ బసవయ్యకూడా ద్విగుణీకృతోత్సాహంతో తన యావచ్ఛక్తీ వినియోగించి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్రభుత్వం తనకు తాను తన నీడను చూసుకొని నిర్నిమిత్తంగా అదిరి పడుతున్న రోజుల్లో విస్సన్న చెప్పిందే వేదవాక్య మౌతుందనే సత్యంలో బసవయ్యకు అనుమానం లేదు. అందుకు కావలసిన సాక్ష్యం కూడా ఉంది.
ఇలాంటి అవకాశమే ఆశ కల్పించక పోతే బసవయ్య కుటుంబం ఏనాడో శివ సాన్నిధ్యాన్ని అలకరించీ ఉండేది.
దుండగీండ్రంటే బసవయ్యకి గౌరవం ఉన్నదీ లేదు; పోయిందీ లేదు. అయితే ఇప్పుడు మాత్రం గౌరవం పెచ్చు పెరిగింది. వాళ్ల బుర్రలమీద ప్రత్యేక ధరలుండటం, ఆ ధరలమీదికి అతగాడి మనస్సు ఉరకలు వేసుకొంటూ పరుగెట్టటమే దానికి కారణం.
ఉన్నటుండి ఒకసారి ఏదో తెలుగు దిన పత్రికలో ఇలాంటి జాబితాయే తిరగేశాడు. ఆదృష్టమేమిటో చెప్పలేంగాని ఆడబోయిన తీర్థమే ఎదురైనట్టయి దగుల్బాజీ దానయ్య పేరు దృష్టిలో పడింది.
దానయ్య బుర్ర ఒక్కటే వెయ్యి రూపాయల ఖరీదు; బహుశా ఏనుగంతటి మనిషై ఉండాలీ. కానీ, దానయ్య గుర్తేమీ బసవయ్యకు తగిలినట్టు లేదు; ఇలాంటి అదృష్టం తన కొక్కడికే కళ్లబడ్డప్పుడు గుట్టుగా సంసారం గడుపుకోవాలిగాని రచ్చబండ కీడ్చుకోకూడదని బవయ్య తలపోశాడు. తండ్రి సంగతైతే ఒక పెద్ద దేశముఖే కాని తండ్రి దగ్గర కొడుకు ఉండటంలేదని అందరకు తెలుసు. అయినా ఆ ఇల్లు చాలాసార్లు సోదా అయ్యింది. ఎటొచ్చీ అనుమానించ వలసిన మనిషి పట్వారీ చిదంబరం గారున్నారు. పోగా ఆయన ఇంట్లో చీకటి కొట్టొకటి ఉంది కూడా. వెయ్యిరూపాయల బహుమానం ఊరుకోకుండా బసవయ్య బుర్రలో జెర్రిపిల్లలా దూరి అతని అనుమానాన్ని ధృవీకరించింది. నిప్పు లేకుండా పొగ ఎలా పుడుతుంది కనుక.
బసవయ్య అప్రమత్తుడై విధ్యుక్తధర్మానికుపక్రమించాడు. పట్వారీ చిదంబరంగారింట్లో చీకటికొట్టు ఎక్కడుందో కనిపెట్టి రమ్మని ఇద్దరు గుంపులాళ్లని బత్తాయించాడు. వాళ్లు ముష్టికనే వంకతో వెళ్లి కాల్చి ఫలితంమాత్రం అంత ఆశావహంగాలేదు. అక్కడ నౌకర్లూ చాకర్లూ తప్ప ఇంకెవళ్లూ లేరని గుంపులాళ్లు ఘంటాపధంగా చెప్పారు. ఎవళ్ళో కాల్పిచంపబడ్డారని విని ‘రామరామ’ అన్నందుకు ఇద్దరు వెట్టివాళ్లకు ఆ పట్వారీ ఉద్వాసన చెప్పాడట కూడా! ఒక వంటవాడు, తోటమాలి, మంగలి తప్ప ఇంకెవ్వరూ ఆ ఇంట్లో లేరని నిస్సందేహంగా `తేలిపోయింది.
బసవయ్య తనే పూనుకొని తోటమాలి నడిగాడు గాని ఆ భోగట్టా కూడా ఏమంత రుచించలేదు. బసవయ్యకు ఒళ్లు మండిపోయింది. చిడంబరం గారి సంగతి అతనికి తెలియంది కాదు. చిత్తుగా తాగుతాడనీ, బూతులు కూస్తాడనీ, జులాయి సరుకనీ అతని కిదివరకే తెలుసు. అలాంటి లుచ్ఛాకి తన భవనంలో అంతే శుభ్రమైన చీకటికొట్టుంచుకొని – తనకు స్నేహితుడూ, యజమానీ, చుట్టమూ, సర్వమూ ఐన దేశముఖు కొడుకును దాచే పాటి ఔదార్యం లేకపోయిందే అని మనస్సులో లక్షసార్లు బూతులు తిట్టాడు. ఇంచుమించు తన జేబులో ఉన్న ట్టే అని భావించిన బహుమానాన్ని ఆ పట్వారీయే దొంగిలించినట్టనిపించి జేబులు తడుముకొని దుఃఖపడ్డాడు. పాపం, బసవయ్య మనుష్య మాత్రుడైన బసవయ్య ఒకడూ ఏం చెయ్యగలడు?
మరికొంచెం దీర్ఘంగా ఆలోచించేసరికి బహుశా పట్వారీ ప్రదర్శిస్తున్న ఖద్దరు వేషమంతా ప్రభుత్వాన్ని వంచించటానికేనేమో అనే అనుమానం కలిగింది. మనిషంత మనుష్యులు చచ్చిపోతే అందులోనూ బలవంతపు చావు. ఊరికే ‘రామరామా’ అన్నందుకే నౌఖరీ బర్తరఫ్ చెయ్యాలి? అని ప్రశ్నించుకొన్నాడు. ఇందులో తప్పకుండా మోసం ఉండిఉంటుంది. ఏదొ రహస్యాన్ని దాచటానికే పైకి పెద్దమనిషిలా, దేశభక్తుడిలా నటిస్తున్నాడు.
ఆ నౌఖర్లే గూఢచారులై తన రహస్యాన్ని పసిగట్టి వెల్లడిస్తారేమోననే భయమే కారణమై ఉండొచ్చు. లేకపోతే ‘రామరామా? అన్నంతలో ఉద్యోగం ఊడిపోతుందా! తను ఎన్ని సార్లు ‘రామరామ’ అనలేదుగనక! తనింకా ఆ టోపీ పెట్టుకొనే ఉన్నాడే!
ఇలా ఆలోచించి, ఆఖరికి నిర్ధారణ కొచ్చి, సరే చూదామని మళ్లీ నలుగురు మనుషుల్ని పురమాయించి పట్వారీ ఇల్లు కని పెట్టడం ప్రారంభించాడు. దుర్మార్గం ఎంతకాలం దాగుతుంది గనక! కానిస్టేబుల్ బసవయ్య పుణ్యం పుచ్చింది. అచ్చు దానయ్య తండ్రిలాంటి మనిషి ఒకాయన ఒక రాత్రి పట్వారీ చిదంబరంగారింటి కొచ్చి రెండు గంటలసేపు గుసగుసలాడి వెళ్లి పొయ్యాడని తేలింది.
అది చాలు బసవయ్యకు. ఇంక సందేహించవలసిన అవసరంకూడా లేదు. అలాంటి అర్థరాత్రి వేళ్ళ తక్కుతూ తారుతూ దేశముఖంతటివాడే వెళ్ళాడంటే.. అక్కడ అతని కొడుకు దాంకొని ఉంటాడనటంలో అనుమానం దేనికి?
బసవయ్య చర్య తీసుకొన్నాడు. చీకటిపడుతున్న సమయంలో సూటిగా పట్వారీ ఇంటికి వెళ్లాడు. తలుపులు ఫడీలుమని తన్ని, హడిలిపోయి తలుపు తీసిన బంట్రోతుని పక్కకి నెట్టేశాడు. చేతిలోకి లాఠీ ఆడించుకొంటూ ఠీవిగా, దర్జాగా తానే ఆ ఇంటి యజమానినైనట్టు హాలంతా పచార్ చేశాడు. కిరసనాల్ దీపం వెలుతురులో, ముక్కి వాసనకే ముక్కు మూసుకొని హాలంతా కలయ వెదికాడు.
మట్టిముద్దలు బెల్లులు బెల్లులుగా రాలిపొయ్యాయి. చిలకకొయ్యని మాసిన బట్టలు వేలాడుతున్నాయి. చేతులు విరిగిన కుర్చీలు రెండు. ఆ ఇంటి అందానికి తగ్గ అలంకారం జిడ్డుముఖం ఓడుతూ చిరిగిన మురికిగుడ్డల్లో జేజెమ్మలాంటి బంట్రోతు.
పట్వారీ ఏడని పోలీసు గర్జించేసరికి బంట్రోతు అప్పికొండకి సగం పక్షవాతం వచ్చేసింది. రెండుగుటక లేసి, కళ్లు గుండ్రంగా తిప్పి ఆ చింపిరి జుట్టు అప్పికొండ “అయ్యగారు అన్నం తింటున్నారు” అన్నాడు.
బసవయ్యకి ఒళ్లు మండింది. అయ్యగారు అన్నం తింటున్నా గెడ్డి తింటున్నా బసవయ్యకి ఒకటే. అయ్యగారంటే సూపర్నెంటు దొరగారా ఏం? ఒక్కసారి బూటు కాలుతో నేలని ఫడీమనితన్ని, గిరుక్కున తిరిగి గబగబా వంటింటి వైపు నడిచాడు కానిస్టేబుల్ బసవయ్య.
పట్వారీ చిదంబరంగారు సామాన్యం మనిషి కాడు. ఆర్షేయ పౌర్షేయాలకు లోటు లేనివాడు; ఆహితాగ్ని, వ్యక్తి గతంగా తనెంత త్రాగుబోతు, లుచ్ఛా, తుంటరీ అయినా వంశగతంగా కాదు. ఆయన పొత్తుపంచె కట్టుకొని భోజనం చేస్తున్నాడు. ఉత్తరపర్ష్యం పట్టటానికి ఇంకా కొంత వ్యవధి ఉంది.
బసవయ్య బూట్లు చప్పుడు చేసుకొంటూ తిన్నగా వంటింట్లో కొచ్చేసరికి చూసి నిర్ఘాంతపొయ్యాడు. నిర్ఘాంతపోయిన చిదంబరాన్ని
పరకాయించి చూసి చిరునవ్వు నవ్వాడు బసవయ్య. నవ్వుతూ నమస్కారబాణం కూడా విసిరాడు.
“ఎవడివిరా నువ్వు ఛర్రుమన్నా డు చిదంబరం. “నీకు మంచీ చెడ్డా లేదా ? అడ్డమైన కుక్కలూ లోపలి కొస్తుంటే బంట్రోతు వెధవ ఎక్కడ చచ్చాడు ?- వీడి మొహం తగలయ్య!” ఇంతలో అప్పికొండ అడుగుల చప్పుడు వినబడింది : “పందిలా తింటున్నావ్, నీ బుద్ధి ఎక్కడ చచ్చిందిరా ?”
” నేను చెప్పానండయ్యగోరూ ! ” తలుపు వెనక నించి అప్పికొండ. ” ఈయన ఇనిండు కాడు!
“పొండవతలకి, వెధవల్లారా !”
యజమాని ఆజ్ఞ వినటమే తడవుగా అప్పికొండ అవతలకి తుర్రుమన్నాడు. కాని స్టేబుల్ బసవయ్య మాత్రం యిలా నిలబడ్డాడు.చటుక్కున చెయ్యి కడు క్కుని చిదంబరం పీట మించి లేస్తూంటే, మెల్లిగా నాలికతో పెదవులు తడుపుకొని “కోప్పడకండి బాబూ” అని ప్రాధేయపడ్డాడు బసవయ్య. ” నేను మీద అతి ముఖ్యమైన పనుండి వచ్చానండి. దేశముఖుగారి అబ్బాయి, దానయ్య గారు…
పట్వారీ తెల్లబోయి చూశాడు. తమాయించుకొని “కమ్యూనిస్టు” వెధవలు ! అని, నిట్టూర్చి “నీకేమీ బుద్ధి లేదట్రా ! నాకేమిట్రా సంబంధం?” అన్నాడు.
“అదే మిమ్మల్నడగాలని వచ్చానండి. ”
“ఓరి నీ పొగరు తగలెయ్యా!
బసవయ్య ఒక అడుగు ముందుకేశాడు. నవ్వాడు. అతని కంఠం, ప్రవర్తనా అంతా ఎకసక్కెంగా ఉన్నాయి. “దొరగారు అతనెక్కడున్నాడో చెప్పి – బైట పడతారనుకొన్నాను; మరేమీ లేదు లెండి.” పట్వారీని కూడా ‘ఒరేయ్’ అనా లనిపించింది కాని, పలుకుబడిఉన్న కాంగ్రెస్ వాడని సందేహించాడు బసవయ్య.
“అదా నువ్వనుకున్నది! ఓరి తెలివి తక్కువ దద్దమ్మా! నామాట జాగ్రత్తగా విను. నిన్ను వఠ్ఠి తెలివి తక్కువ దద్దమ్మవంటున్నాను. అదే నాకు తెలిసిన సంగతి. పట్వారీ బాగా చికాకుపడ్డాడు “ఈవెధవ ఎక్కడ చచ్చాడు ?” అన్నాడు. ఆ ‘చచ్చిన వెధవ’ బంట్రోతు ఎదుటబడ్డాడు. “ఒరేయ్, కానిస్టేబుల్ వెడతాడు. జాగ్రత్తగా సాగనంపిరా. ”
బసవయ్య ఒప్పుకోలేదు. “లేదండయ్యా, ఇంకా వెళ్లటం లేదు. నాకు సంగతంతా తెలిసింది. మీరనుకున్న దానికంటే నాకు చాలా తెలుసు. నిర్మొహమాటంగా చెప్పండి. దానయ్యని మీరెప్పుడు చూశారు? ”
“నాకేమీ గుర్తు లేదురా అన్నాడు పట్వారీ. “నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు. చాలా చిన్నప్పుడు చూశాను. ఈ పాటికి ఎక్కడా ఆనమాలు దొరక్కుండా మారిపోయి ఉంటాడు.”
“సరే లెండి! పోనీ ఒకటి చెప్పండి: గత రెండు రాత్రిళ్లూ మీరూ, దేశముఖూ ఏమిటీ మాట్లాడుకుంటున్నట్టు ?”
బసవయ్య ఒక తుపాకీ గుండు విసిరాడు. ఆ దెబ్బకి పట్వారీ ముఖం ఎలా పెడతాడో చూడాలని బసవయ్య ప్రయత్నించాడు కాని పట్వారీ చీదరించుకున్నాడు.
“అయితే నన్ను వెంటాడుతున్నావన్న మాట ! ఓరి నీ దౌర్భాగ్యం కూలబడ! సరే అడిగావు గనుక చెపుతున్నా. నీలాగే ఆయన కూడా పొరబాటు పడ్డాడు. దొంగ వెధవలకి తలదాచుకొందుకు స్థలమిస్తానని- వాడి పొగరు తగలెయ్యా – ఆయన అభిప్రాయపడ్డాడు.”
“అంటే ఆయన తన కొడుకును దాచమన్నట్టూ తమరు తిరస్కరించినట్టూనా !” కానిస్టేబిల్ నవ్వాడు.
“అదేనా మీ అర్థం?”
“నీ పీడ ఎంత చప్పున విరగడౌతుందా అని చూస్తున్నాను. అందుకని నిజం చెప్పేశాను. ”
“అయితే దయతో మీ చీకటికొట్టు తణిఖీ చేయనీయండి.
“చీకటికొట్టా?” బసవయ్య కళ్లు పట్వారీ ముఖంలో భయాన్ని పసిగట్టాయి. “ఇదేదో పేదరాజు పెద్దమ్మకథలా ఉంది. ”
“విూ మేడలో చీకటికొట్టున్న సంగతి పేదరాజు పెద్దమ్మకథేమీ కాదు. ఈ ఊరందరికీ ఆ విషయం తెలుసు.”
“ఇదిగో తోకంటే అదిగో పులంటారు వెధవలు!”
“పట్వారీగారూ, మీ రాలస్యం చేస్తే నేను మా ఇన్ స్పెక్టర్ గార్ని తీసుకురావాలి.”
“బెదరిస్తావ్ దేనికి? తీసుకురా!”
“దేశద్రోహులకి తలదాచుకోనిస్తే తల ఎగిరిపోతుందని మీకు తెలియని సంగతి కాదు. మా ఇన్ స్పెక్టర్ గారు వచ్చి దానయ్యను పట్టుకున్నారంటే మీ తల ఠాణాకు వ్రేళ్లాడాల్సిందే. మీ అంత మీరే నాకు అతగాణ్ణి అప్ప జెప్పినట్లయితే ఎక్కడ దొరికాడో ఎవరికీ తెలియఖ్ఖర్లేదు. నే నెవరితోటీ చెప్పను లెండి. ఇదిగో మీకీ గొప్ప ఆవకాశం ఇస్తున్నాను. ఈ అదృష్టాన్ని చేజార్చుకోకండి.”
“నువ్వు చాలా మంచివాడివే. కాని, నీకోసం దేశద్రోహుల్ని ఇక్కడ నేను దాచుకు కూచోలేదు. కనక వచ్చిన దారంటే దయచెయ్.”
బసవయ్య భల్లూకపు పట్టుపట్టాడు. “నన్ను వొదుల్చుకోవటం మీ తరం కాదు. ముందు ఆ చీకటి కొట్టు సోదా చెయ్యందే వదలను.
పట్వారీ ముఖంలో నెత్తురు నాళాలు ఉప్పొంగిపొయ్యాయి. విపరీతమైన కోపం వచ్చింది. అంతనీ జేబురుమ్మాలతో అణచుకొని “సరే, అయితే పద. ఒరేయ్, దీపం పట్రా !”
బంట్రోతు దీపం పుచ్చుకొని ముందు నడుస్తున్నాడు; తడబడే కాళ్లతో పట్వారీ వాణ్ణి అనుసరించాడు. ఠీవిగా లాఠీ ఊపుకొంటూ బసవయ్య వెంబడించాడు. ముగ్గురూ ఒక వరసలో నడుస్తున్నారు.
“ఆగరా, దీపం పెద్దది చెయ్యి. బంట్రోతు ఆగి దీపం పెద్దది చేశాడు. కొట్టు గొళ్ళెం తీశాడు. ఆరడుగుల గది. ఆ గదిలో ఒక కుర్చీ ఒక బల్ల ఉన్నాయి. పట్వారీ పక్కకి వత్తిగిల్లి “ఈసారి ఆత్మ సంతృప్తిగా సోదాచేసుకో !” అన్నాడు.
బసవయ్య గడపకమ్ములు పట్టుకొని లోపలి చీకట్లోకి తొంగిచూస్తున్నాడు
వెనక్కాల పట్వారీ ఉరుముతూనే ఉన్నాడు. “లోపలికి తగులడు.”
పృష్టంమీదికి ఒక తన్ను దూకి కానిస్టేబుల్ని ముందుకు ఊపి, ఆ గదిలో బూడిదలో పడేసింది.
వెంటనే వికటంగా నవ్వు, తలుపు చప్పుడు, గొణ్ణెం మోత వినిపించాయి. కానిస్టేబుల్ బసవయ్యని పూర్తిగా చీకటి చుట్టి ముంచివేసింది.
కానిస్టేబుల్ లేచి నించుని ఒక్కసారి నిట్టూర్చి తలుపు ఉన్నదన్న వైపుకు తూగి తల బొప్పి కట్టించుకున్నాడు. కూర్చుని, తిట్టుకొని, శాపనార్థాలు పెట్టి, బెదిరించి, చివరకి మనస్సు చెదరగొట్టుకొన్నాడు. తన స్థితిని తానే సమీక్షించుకొని “ఒక ఊరి రాజు, ఒక ఊరిమాల” అనుకుని ఓదార్చుకొన్నాడు. ‘భయంకర నారీ పిశాచి’ మొదలైన తాను చదివిన డిటెక్టివ్ నవలలో అవస్థలు పడ్డ అపరాధ పరిశోధకుల జీవితాలతో సరిపోల్చుకొని కొంత ఊరట చెందాడు. “ ఈగదికి అడుగు ఒక మీట నొక్కి తే ఊడి పోతుందేమో ! లేదా ఈ గదినిండా నీరు చిమ్మి తన ప్రాణం తీస్తుందేమో !’ ఇలాంటి కథావస్తువులన్నీ తలచుకొని ఏడ్చాడు. అతని ఏడుపు ప్రతి ధ్వనించింది తప్ప, బైటనించి చీమ చిటుకుమన్న చప్పుడు కూడా వినిపించ లేదు. ఈ గదిలోనే తాను యావజ్జీవితమూ కుళ్లి కృశించి చావవలసి వస్తుందని భయపడి చెమట్లు కక్కుకున్నాడు. ఇంచుమించు అతడు జీవవచ్చమాధిలో బంధింపబడి పోయినట్లయింది.
కాని, ఆశ్చర్యం ! ఉదయమే ఆ తలుపులు తెరుచుకొనేసరికి అతను నమ్మలేక పోయాడు. కృతజ్ఞత చెప్పవలసిందే కాని గొంతుక పెకిలిరాలేదు. కోపం వచ్చింది కాని, కోపాన్ని పూర్తిగా భయం దిగమింగి వేసింది.
“ఆ గదిలో ఎవడూ దాంకోలేదని తీరుబడిగా వెదకిచూసుకున్నావా?” బసవయ్య ప్రాణం చివుక్కుమంది.
“నాలాంటివాడి దగ్గర నీ నక్క వేషాలేమీ సాగవని గ్రహించే ఉంటావ్. దేశద్రోహులకోసం ఇంకెక్కడన్నా వెదకు. ఇక్కడ కాదు. ఈ ఖమ్మం మెట్టులో దేశద్రోహుల్ని దాచి మెడకి ఉరి పోసుకునేటంత పిచ్చిఘటం ఎవరూ లేరు.
చీకటికొట్టు శూన్యంగా ఉండటం బసవయ్య ఊహగానాలన్నింటినీ వమ్ము చేసింది. మనిషి ఎంత అగ్నిహోత్రంలాంటి వాడు కాకపోతే పోలీసువాణ్ణి ఇంత ధైర్యంగా ఏడిపించగలడు? ఈ ఆలోచన బసవయ్యని లొంగదీసి వేసింది. పట్వారీ దౌర్జన్యానికి కసి తీర్చుకోవలసిన బసవయ్య కాలు దువ్వలేక పొయ్యాడు. పాపం, తను కష్టపడి లెక్క పెట్టిన వెయ్యిరూపాయల జార్జి బుర్రలూ చేజారిపోయ్యాయని దిగాలు పడ్డాడు.
పట్వారీ తనమీద దౌర్జన్యం చేసినందుకు కాదుగాని, తన అదృష్టాన్ని వెక్కిరించి నందుకు కక్షగట్టాడు బసవయ్య. తల ఎత్తుకొని ఠీవిగా ఆ ఇంట్లో కెళ్ళిన తను – తల వంచుకొని, తోక ముడుచుకు పరిగెట్టే కుక్కలా ఇంట్లోంచి బైటకు రావలసి వచ్చిన దృశ్యం తలచుకొని కుమిలి పొయ్యాడు. వెంటనే అతనికి పట్వారీ చెప్పిన రెండు ముఖ్య విషయాలు జ్ఞాపకం వచ్చాయి. వాటిని తను గత రాత్రయితే నమ్మలేకపోయాడు. కాని ఇప్పుడు అసలు సందేహించవలసిన అవసరమే కనబడ లేదు. మొదటిదేమంటే పట్వారీ, దానయ్యను చాలా చిన్నప్పుడు చూశాడు. రెండవది: ఒక వేళ పట్వారీ దానయ్యని తిరిగి చూడవలసివచ్చినా ఇప్పుడు గుర్తుపట్టలేడు. జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ రెండుసూత్రాలు పట్వారీ బసవయ్యకు చేసిన అన్యాయానికి నష్టపరిహారం ఇప్పించగలవ్. ఆ ఆలోచనలోని దుర్మార్గం బసవయ్యని ఒక్క క్షణం నిలబెట్టింది. అయినా అతని చేతుల్లో కరిగి మాయమై పోయిన బంగారానికి మాత్రం అది దుర్మార్గం కాదు సరిగదా – సన్మార్గం అని తోచకమానదు.
అప్పటికి మూడు రోజులు గడిచి పొయ్యాయి. ఒకనాటి మధ్యాహ్నం, రామాయణం చదివి చదివి అలిసిపోయిన పట్వారీ నిద్దరపోతూండగా కిటికీ తలుపులు బాదిన చప్పుడయింది. పట్వారీ తృళ్లిపడి, కళ్లు తెరిచి గుండెలమీది రామాయణం తీసి ఆ శబ్దం వచ్చిన వైపుకి చూశాడు.
కిటికీ ఊచల్లో తల దూర్చి ఒక యువకుడు నిలుచున్నాడు.
పట్వారీ మంచం దిగి గొనుక్కొంటూ ఆ వచ్చిన వాడెవడో ఎందుకొచ్చాడో వాకబు చేద్దామని వెళ్లాడు.
“మా నాన్నగారు సన్ను మీ దగ్గరికి పంపించారు.” ఆ వచ్చినతను తడబడుతూ చెప్పాడు. మనిషి చూస్తే బక్క పలచగా ఉన్నాడు. పాతిక ముప్ఫై ఏళ్లుంటాయి. కొంచెం ఒగరుస్తున్నాడు. పల్చని ముక్కు. కొనదేరిన గడ్డం, బట్టలు మాసినవీ, సామాస్యమైనవైనా పెద్ద వంశం వాడని స్పష్టం చేస్తున్నాయి. “ఎలాగో నిన్న రాత్రి బైట పడ్డాను. అప్పట్నుంచీ ఇప్పటిదాకా ఈ ఊరి బయట చెరుకుతోటలో తలదాచు కున్నాను.” నుదిటిమీది చెమట ఊడ్చుకున్నాడు. మీరు నన్ను కడుపులో పెట్టుకోవాలి.” అంటూనే పట్వారీని తప్పించుకొని గదిలోకి దాటేశాడు. “మానాన్నగారు మీరాయనకి పుత్రదానం చేస్తారని, ఆయన కోరిక మన్నిస్తారనీ విశ్వసిస్తున్నారు.
పట్వారీ ముఖంలో అగ్నిహోత్రం రగులుకొంది. కనుబొమలు బాణాల్లా ఒంగాయి. “విశ్వసిస్తున్నాడు! ఎవడ్రా వాడు? ఎవడ్రా మీ నాన్న? నువ్వెవడివిరా? శనిముండా కొడక! ”
ఆ కొత్తాయన నాలుగడుగులు లోపలికి వేసి “లోపలికి రండి బాబూ, లేకపోతే కనబడిపోతాను.”
పట్వారీ ఆశ్చర్యంతో అచేతనుడవటంవల్ల తనకు తెలియకుండానే గోడ చాటుకు నడిచాడు. అక్కడికి మళ్లీ మనిషయ్యాడు” ఎవడివిరా నువ్వు, నీ మొహం తగలెయ్య !”
“అయ్యో, మీరే నన్ను మరిచిపోయారా! నేను దానయ్యని.”
“నువ్వా నాయనా, దానయ్య!” పట్వారీ పళ్లు గిటకరించాడు. “ఇప్పుడర్థమయింది. ఈడ్చి తంతే వెళ్లి పోలీస్ స్టేషన్లో పడతావ్. అబ్బాయి, నీ సంగతి నిజం చెప్పక పోతే నీ గతి అంతే.”
“ఓరిభగవంతుడా ! మీరింకా నన్ను గుర్తు పట్టలేదా?” ఆ అబ్బాయి, పాపం, బిక్క మొఖం వేశాడు. ” నేనండీ కమ్యూనిస్టు దానయ్యని.”
“ఏమిటి నువ్వు?” పట్వారీ ఉరుముతూ ముందుకురికాడు “నీ… నోటి చివరకొచ్చినమాటని అదుముకున్నాడు. కోపంతో ముఖం కందగడ్డలా అయిపోయింది. కొరడా అందుకుని పనిపట్టాలను కున్నాడు కాని, చేతులు స్వాధీనం కాలేదు. కొంతసేపటికి ఎలాగో తమాయించుకొన్నాడు. “మీ నాన్నతో వల్లకాదని చెప్పినప్పటికీ తల బిరుసెక్కి వచ్చావన్న మాట! దేశద్రోహుల్ని దాచేటంత నీచుణ్ణి కానని నేను చెప్పలేదా?”
పాపం, ఆ ఆ కుర్రముఖం తెల్లబొయ్యాడు. ఆ కళ్లల్లో ప్రార్థన నిండేలా చూస్తూ “నాస్థితి కొంపములిగేటట్టుందండయ్యా, నన్ను వెనకాలే తరుముకొస్తున్నారు. ఆ స్థితిలో కనీసం మా నాన్న గారి ముఖం చూసన్నా నన్ను తరిమి వెయ్యరనే ఆశతో వచ్చాను. మీ ఇంటి చీకటికొట్లో పడుంటాను. కాకులు కూసింది లగాయతు పట్నం మాటుమణిగే దాకా కిక్కురుమనను, దీనివల్ల మీ కొచ్చే నష్టమేమీలేదు; పోగా ప్రాణదానం చేసిన వారౌతారు.”
పట్వారీ అతగాణ్ణి పూర్తిగా చెప్పనిచ్చాడు. ముకుళించిన కనుబొమలమాటునుంచి ఒక కంట కని పెడుతూనే ఉన్నాడు. అతని మొర పూర్తికాగానే కొంచెం సకిలించి.
“నీకుళ్లు ప్రాణాన్ని కాపాడటం నా పూచీ అనుకుంటున్నావేఁ?” అన్నాడు చిదంబరం.
“అయితే నేను చావటం మీ కిష్టమేనా?”
“నువ్వు ఉంటే నాకేఁ, ఊడితే నాకేఁ? ఛస్తే ఛావు; బ్రతికితే బ్రతుకు. నువ్వు దానయ్యవే అనుకుందాం. అయినంత మాత్రంలో నేను దేశ ద్రోహం ఎందుకు చెయ్యాలంట ?” ఏవేనా నిర్థాక్షిణ్యంగా ఉండాలనే పట్వారీ నిర్ణయించుకున్నాడు.
“మానాన్న గారికి మీ మీదున్న…
“అయితే ఉరిపోసుకోమంటాడా? ఇంక వెళ్లిపో బాబూ, నీకు పుణ్య ముంటుంది. నిన్ను పోలీసుల కప్పగించే విధిని నేను నిర్వర్తించక పోవటమే నీకు ఉపకారం. దయచెయ్.”
“అయ్య బాబోయ్ ! ఎల్లాగ ! ” పాపం, ఆకుర్రాడు ఒక్కసారి నిట్టూర్చాడు; కళ్లనీళ్ల పర్యంతం అయ్యాడు. ఇక తప్పదు కదా అని బైటికొచ్చి ఇటూ అటూ చూసుకొని “అమ్మయ్యో, చచ్చాను !” అన్నాడు.
చిదంబరం కన్నెత్తి చూశాడు. ఇంకేముంది. బసవయ్య ప్రత్యక్షమయ్యాడు. “నమస్కారం చిదంబరం గారూ; ఓపిక కొద్దీ లాభమని తెలుసు నాకు. దొంగ దొరికాడు; ఇంకెక్కడికి పోతారు?””
“అదా సంగతి ! ఇంతేనా!” అన్నాడు చిదంబరం, అని నవ్వాడు.
“అదే సంగతి; అంతే” బసవయ్యకూడా ఒప్పుకొన్నాడు. రెండడుగులు ముందు కేసి “ఈసారి నాకు టోపీ వెయ్యలేరు రెండి.” అన్నాడు బసవయ్య.
“నాకేమొచ్చె! అడుగో నీకు కావలసిన మనిషి. తీసుకుపోయి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ”
“అది మీరొద్దన్నా మానేది లేదు. పోతే, మీ సంగతి.” బుర్ర టకాయించి “పాపం మిమ్మల్ని కిందపెట్టాలి.”
“నన్నా?” పట్వారీ తృళ్ళిపడ్డాడు.
“ఒక దేశద్రోహిని దాచటం, ఈ రోజుల్లో, సామాన్యమైన నేరమా. చావుతప్పి కన్ను లొట్టపోయినంత పని. మొన్న రాత్రి గొడవని ఇంకా కడుపులో పెట్టుకోలేదు లెండి. అప్పుడే మరిచిపోయాను. ఇతగాణ్ణి ఇప్పుడు పట్టుకున్నా ఏమి ఎరగనట్టే వెళ్లిపోగలను. అనవసరంగా మీరు చిక్కుల్లో పడిపోతారు పాపం. పోగా అమాయక కుర్ర కుంకల్ని చిత్రవధ చేయించటంకూడా నా లాంటి పిల్లలుగలవాడికి ధర్మం కాదు. ”
“అయితే ఎందుకొచ్చావ్ ?””
“ఎందుకంటారా? బీదవాడు ఏం చేస్తాడు చెప్పండి! దానయ్య నాకు వెయ్యి రూపాయల ఆదాయ మాయిరీ!”
“అదేనా నువ్వు ఆలోచించాల్సింది?”
“ఏం చెయ్యమంటారు చెప్పండి? నలుగురు పిల్లలూ, పెళ్ళామూ, నేను మొత్తం అయిదుగురం. నా రెక్క ఆడితేనే గాని డొక్క ఆడదాయేను. కడుపునిండా వాళ్లకి తిండన్నా పెట్టాలికదా.”
దౌర్భాగ్యుడు అడ్డొచ్ఛి “అంటే ఒక్క వెయ్యిరూపాయ లిచ్చేస్తే…ఆఁ.. నన్ను చూడనట్టు వెళ్లి పోతావా? అంతేనా?
బసవయ్య సకిలించాడు. దగ్గాడు, ముంజేతి వేళ్లు నులుపుకొన్నాడు. “విన్నారాండీ, సార్ ? ”
చటుక్కున ఆ వచ్చిన దానయ్య పట్వారీ కాళ్ల మీద పడి :
“ఎలాగో నన్ను కాపాడండి; నా ప్రాణభిక్ష పెట్టండి. పైజన్మలో మీ కడుపున పుడతాను, మా నాన్నగారితో చెప్పి మీ అప్పు సాయంత్రానికి రెట్టింపు ఇప్పిస్తాను. ”
“అబ్బాయి, ఇప్పటికే మీనాన్నగారు చచ్చేటంత బాకీ ఉన్నారు; ఆ సంగతి నీకు తెలియదు గనకనా. మళ్లి నన్ను మొహమాట పెట్టకు. ”
“మీరే అలా అంటే నా ప్రాణం ఏమై పోవాలి చెప్పండి…”
“చిదంబరం గారూ ఒక సంగతి చెప్తా ఆలోచించుకోండి. ఇది గోళ్లతో మీటితే పోయే వ్యవహారం కాదు. ” బసవయ్య యోగముద్ర ధరించాడు. ” నేను దానయ్యను ఎరస్టు చేశానంటే అతనెక్కడ ఎలాగ ఎప్పుడు దొరికాడో చెప్పి తీరాల్సిందే. అంటే మీకు వారంటు వచ్చిందన్న మాటే.
“ఒక వెయ్యిరూపాయలు వదులుకొంటే నీ దారిని నువ్వు ప్రశాంతంగా పోతావన్న మాటేనా?”
బసవయ్య ముఖంమీద జిడ్డునవ్వు మెరిసింది. ” రెండు వేలండి. మీరు దానయ్యకేం తీసిపోయారు కనుక! మీరు మాత్రం అంత ఖరీదు చెయ్యరా?”
“అప్పడూ! ఎక్కడ చచ్చావురా వెధవా!”
బసవయ్య తృళ్ళిపడ్డాడు. “ఎందుకండీ అప్పడు ?”
“నీకు డబ్బిస్తూన్నప్పుడు సాక్ష్యం ఉండఖర్లా!” లేకపోతే మళ్లీ నువ్వు ఇదే వేషం వేస్తే.”
“దొరగారూ” కంగారుపడ్డాడు బసవయ్య. “ఇది సాక్షులు ముందు జరగవలసిన పని కాదండి. అదే అయితే నా మెడకి ఉరిపోసుకోవటమే కదా.”
“నీలాంటి కుక్కల్ని నమ్మకూడదు. నువ్వు నీ దేశద్రోహి వెంబడే పడివచ్చావు. వాడు లోపలికి రావటం కూడా నువ్వు చూశావు. అయితే నిజాన్ని నమ్మటం నీకు ధర్మంగా తోచలేనట్లుంది. ”
“ఆ సంగతి కోర్టులో చెప్పుకొందురు గానీ లెండి.””
“అయ్యగారు పిలిచిన్రా!” అప్పికొండ లోపలికొచ్చి చిదంబరం గారి కేసి చూశాడు. బసవయ్య బాధ మరీ ఎక్కువయింది. ” అయ్యా, జరిగితే రహస్యంగా జరగాలి, లేకపోతే పోనీ లెండి. ”
“నీ చేతుల్లో డబ్బు పోసి నీకు అగ్గగ్గ లాడుతూ ఉండాలనేగా?… ఒరేయ్, పోయి వెంకయ్యని లాక్కురా.”
అప్పికొండ జారుకున్నాడు; బసవయ్యకు వణుకుపుట్టింది. సాక్ష్యులు వచ్చే లోపుగానే ఈ వ్యవహారం అమీతుమీ తేల్చుకోవటం మంచిదని
“పోనీ, గొడవెందుకులెండి. దానయ్యకని వెయ్యిరూపాయ లియ్యండి చాలు, మీకేమీ ఇవ్వఖర్లేదు.”
పట్వారీ నవ్వి “నీకు కావలిసింది వెయ్యి రూపాయలే అయితే, అదిగో తీసుకెళ్లు.” వేలెత్తి బిక్కముఖం వేసిన దానయ్యను చూపించాడు. “వాడి బుర్రమీదే ఉందిగా ఆ విలువ ! వెంటనే పట్టుకుపో.”
“బాబోయ్, నిజమేనాండి?” దానయ్య హడిలిపోయాడు.
“అబద్ధ మాడటానికి నాకేమొచ్చింది ?”
బసవయ్య చివరిసారి రంకె వేశాడు. “అదే మీ ఆఖరి నిర్ణయమైతే మీరు ఎరస్టు కాక తప్పదు. ”
“అది ఇంతకుముందే చెప్పావుగా !”
“అయితే నన్ను సమ్మరా?
“ఇదిగో వెంకయ్యగారు. ” ముసలి వెంకయ్యగారు లోపలికొచ్చి నవ్వుతో పలకరించాడు.
పట్వారీ అటుతిరిగి “ఏమి కానిస్టేబులూ నీ బేరం ఈ సారి చెప్పు!”
బసవయ్యకు కోపం వచ్చింది. “మళ్లీ నన్ను పడగొట్టాలని చూస్తున్నారా ? నక్క వేషాలు వెయ్యకయ్యా. నీ దొంగ వేషాలన్నీ ఈ బసవడిదగ్గర కాదు. తర్వాత నువ్వే ఏడుస్తావ్.” దానయ్య చెయ్యి పుచ్చుకొని “పద!” అని గర్జించాడు. గుమ్మం దాటుతూ “లుచ్ఛా గాడిద కొడుకు !” అని వినపడేలా తిట్టాడు.
వెంకయ్య వాళ్లని సాగనంపటానికి గేటు దాకా వెళ్లాడు.
ఇక అప్పికొండ మిగిలాడు. ఇందాకటి అప్పికొండ కాడు. నిద్రమత్తు స్థానే తెలివి ప్రజ్వలిస్తోంది.
నిజంగానే దాసయ్య అనుకుని ఉంటాడా?”
“ఏడిశాడు. నిన్నెంత అనుకున్నాడి వాణీ అంతే అనుకున్నాడు. కోటివిద్యలూ కూటికోసమే కదా. వాడిపని పడతానుండు. పోలీస్ సూపర్నెంటుకు ఉత్తరం వ్రాస్తానుండు. ఫలానా దానయ్య మా ఇంటికి దాంకోటానికి కొస్తే ఇన్నో నెంబరు కానిస్టేబుల్ కి అప్పగించానని చెప్తా. ఈ వెధవ నేనలా చేస్తాననుకోడు. ఈ ఖైదీనేం చేశాడో సూపర్నెంటుకు చెప్పుకోలేక ఛస్తాడు. ఆ వెధవ జైలు కెళ్లాల్సిందే. నా పేరేగాని చిదంబరం నీ పేరేగాని…”
“ఉష్” అన్నాడు అప్పికొండ. అంటూ యజమాని భుజం మీద చెయ్యి వేసి “నిప్పుతో చెలగాటం కాదా?”
“అవును, అయితే? నా వేళ్లు కావుగా కాలేవి?” చిదంబరం నవ్వి రహస్యంగా అన్నాడు. “ఆ చీకటి కొట్లో పడి ఏడుస్తానన్నావ్ ! అప్పుడు నేనే ఒప్పుకొంటే ఈపాటికి ఏమయ్యేవాడివి? మళ్లీ ఇంకోసారి చెపుతా విను. నువ్వొక వస్తువును కనబడకుండా దాచాలంటే, అందరికీ కనబడేలా ఉంచడమే పద్ధతి.”
(రాఫేల్ సెబెటీన్ కథకు అనుసరణ)