Articles on Ramsha

లైంగిక విజ్ఞాన దిక్సూచి – రాంషా

– అమ్మిన శ్రీనివాసరాజు.

26 జూలై 2009 – ఆదివారం ఆంధ్రప్రభ. జూలై 30 రాంషా 85వ జయంతి సందర్భంగా..

స్త్రీ భావాలకూ, ఆలోచనలకూ, అంత ప్రాధాన్యమివ్వని నేటి పురుషాధిక్యసమాజంలో, అనేక వైవాహికసమస్యలు ఎదురవు తుంటాయి. వైవాహికజీవితానికి బలమైన కవచమైన లైంగికవిజ్ఞానశక్తితో సాంసారికంగా సర్దుబాట్లు చేసుకోవచ్చని నమ్మిన వ్యక్తి, దుర్వ్యసనాలకు చేరువై తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్న యువతరం బాగుకోరి శాస్త్రీయమైన లైంగికవిజ్ఞానం అందించిన తెరువరి, వేలాదిమంది జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు, తెలుగు పత్రికారంగంలో వెలువడిన తొలి లైంగిక విజ్ఞానపత్రిక ‘అభిసారిక’ సంపాదకుడు-ఇలా బహుముఖీన ప్రజ్ఞాపాటవాలు కనబరిచిన సాహితీమూర్తి, రాంషా అసలు పేరు దర్భా వెంకటరామశాస్త్రి.

తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట – సమీపంలోని వేట్లపాలెంలో 1924 జూలై 30న ఈ ధరణిపై పాదం మోపారు. రాంషా విద్యార్థిజీవితంలోనే ప్రాచ్య-పాశ్చాత్య కళా-సాహిత్య గ్రంథాలెన్నో విస్తృతంగా చదివారు. బెర్నార్డ్ షా ప్రభావం రాంషాపై చాలా కనిపిస్తుంది. కాకినాడలో పిఠాపురం రాజా కళాశా లలో ఎస్.ఏ. చదువుతుండగానే ‘శిలాప్రతిమ’ అనే నాటిక రచించి, రజతపతకం బహుమతి పొందారు. తరువాతి రచన ‘లక్షింపతి గారమ్మాయిలు’ నాటకానికి ఎంతో పేరొచ్చింది. ‘కామేశ్వరి కథ’ అనే నవల, ‘మీనాక్షి ముద్దు, ప్రియురాలు, పెళ్లి తిరకాసు, మనస్తత్వాలు, చెత్త కథ, ప్రేమపక్షులు’, ఇంకా అనేక గేయరచనలు, అశేషప్రజానీకంలో ఆలోచనలు, రేకెత్తించేలా రాశారు.

రాంషా 1944 నుండి 1955 వరకు కమ్యూనిస్టు ఉద్యమాలలో పనిచేశారు. మార్క్స్ సిద్ధాంతాలు ఆచరణలో లేక పోతే అభాసుపాలుకాక తప్పదని ఆయన వ్యక్తిగతసిద్ధాంతం. బహు ముఖప్రజ్ఞాశీలి ధనికొండ హనుమంతరావు, ‘అభిసారిక, జ్యోతి’ పత్రికలను స్థాపించి నడిపించేవారు. రాంషా 1957లో సామర్లకోటలో ధర్మచక్రపవర్ ప్రెస్ స్థాపించారు. అక్కడ ప్రచురించే బౌద్ధమతగ్రంథాలను రాంషా చాలా ఇష్టపడేవారు. ఆ క్రమంలోనే ఆయన, ధనికొండ వారు నడుపుతున్న అభిసారిక పత్రిక నిర్వ హణబాధ్యతలు 1960లో తీసుకున్నారు. అభిసారిక పత్రిక ద్వారా అనేకలైంగికసమస్యలకూ, అపోహలకు, సామాజికసమస్యలకూ సలహాలు అందించేవారు. దీని వల్ల ఎన్నో వేల జీవితాల్లో ఆనంద జ్యోతులు వెలిగాయి. ప్రాచ్య-పాశ్చాత్య గ్రంథాల్ని అనేకంగా పఠించి, పరిశోధించి, క్రోడీకరించి, శాస్త్రీయంగా, విజ్ఞానదాయకంగా, లైంగిక విజ్ఞానాన్ని ఆదర్శవంతంగా పాఠకులకు అందించ డంలో, రాంషా పూర్తిగా సఫలీకృతులయ్యారు.

ఒక వైపు పత్రిక ద్వారా లైంగికవిజ్ఞానసేవచేస్తూ, అహోరాత్రులు కృషిచేస్తూ మరో వైపు “మీట్ ది ఎడిటర్” ద్వారా ఆంధ్రప్రదేశ్లోని పలుపట్టణాలు సందర్శించి, ప్రత్యేకంగా కౌన్సిలింగ్లు నిర్వహించే వారు. అంతే గాక మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా, పర్య టనలు కొనసాగించేవారు ఈ అనంతమైన కృషిలో వారి అర్ధాంగి శిరీషగారితో పాటు కుమారుడు పూషా సహకారం కూడా ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే, రాంషాగారి యావత్తు కుటుంబసభ్యులూ, ఈ లైంగికవిజ్ఞాన ప్రచారక్రతువులో భాగస్వాములే! ఒక వైపు లైంగికవైజ్ఞానిక క్రతువూ, మరో వైపు సాహితీసృజనా కాక, తన ధర్మ చక్ర ప్రెస్ ద్వారా ఎన్నో అమూల్యమైన గ్రంథాలు ముద్రించి, ఆంధ్ర సాహిత్యానికి చేరువ చేశారు. సాహిత్య ప్రపంచంలో సామర్లకోటకు ఒక సముచితస్థానం కల్పించిన ఖ్యాతి, రాంషాకే దక్కుతుంది. ఆరుద్రగారి ‘త్వమేవాహం’, సోమసుందర్ “వజ్రాయుధం” వంటి ఉత్తమగ్రంథాలు, రాంషాగారి ముద్రణాలయం నుండి వెలువడ్డవే. అత్యంత విలువైన పరభాషా గ్రంథాలను కూడా సరళీకరించి, ఆంధ్రపాఠకులకు అందించిన ఘనత కూడా రాంషాదే! ఆ క్రమంలోనే వాత్స్యాయన కామసూత్రాలను సరళమైన వచనంలోకి అనువదించారు. అలాగే హిందూ వేదాంతశాస్త్రంలో భాగమైన ‘న్యాయదర్శనాన్ని సరళమైన తెలుగులో వెలువరించారు. పత్రికారచన పట్ల మక్కువ ‘గల రాంషా, ‘దండోరా’ అనే సాహితీ మాస పత్రికను కూడా వెలువరించారు. అనేక కథలూ, నవలలూ, నాటకాలూ, విమర్శ వంటి సాహితీ ప్రక్రియలపై ఆయన రాసిన వ్యాసాలు ఆనాటి, భారతి, జ్యోతి, ఆనందవాణి వంటి ప్రముఖపత్రికల్లో ప్రచురితమై, సాహితీ ప్రియుల ఆదరాభిమానాలు అందుకున్నాయి. 1982లో ఆర్ధాంగి శిరీష కాలధర్మం చెందడంతో, ఆమె స్మృత్యర్థం, ఏటా ఒక ప్రముఖ సాహితీవేత్తకు స్వర్ణపతకం అందించేవారు. మొదటిసారిగా ఈ స్వర్ణపతకాన్ని ప్రసిద్ధ కథారచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రికి అందించి, సత్కరించారు. ఆవంత్స సోమసుందర్, రాంషా, ఆదర్శమిత్రులు. వీరికి, ఒకరి ప్రభావం ఒకరి మీదికి ప్రసరించింది.

ఆనాటి తెలంగాణ పోరాటం, స్వాతంత్ర్యోద్యమం, ఆంధ్రరాష్ట్ర సాధనోద్యమం వంటి ఉద్యమాల్లో, తనదైన శైలిలో కలం విదిలించి సామాజిక స్పృహ గల సాహితీవేత్త అని పించుకున్నారు. తెలుగు సాహిత్యంలో అన్ని ప్రక్రియలనూ స్పృశించిన రాంషా కలం, అనేక ఉత్తమోత్తమమైన రచనలను వెలువరించింది. ప్రతి ప్రక్రియలో నిర్దిష్టమైన ప్రామాణికత నిగారింపు కనిపిస్తుంది. వీరి ప్రామాణిక సాహితీసృజనకు కారణం ఆయనకున్న లబ్ధప్రతిష్ఠులైన వేంకట పార్వతీశం కవులు, వేదుల సత్యనారాయణశాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి ఉద్దండులైన సాహితీ మిత్రగణమే. తెలుగు సాహితీలోకానికి వరమైన రాంషా, 63వ ఏట 8.2.1990న కారు ప్రమాదంలో కాలధర్మం చెందారు. ఎందరి జీవితాలలోనో సంతోషాలను వెదజల్లి ఎంతో సంస్కారం అందించిన రాంషా వ్యక్తి కాదు, ఒక మహావైజ్ఞానిక సంస్థ! అంతటి మహనీయుని రచనలు నేటివారు చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన రచనలు పునఃముద్రించటంతోపాటు పరిశోధనలు చేయాల్సిన అవసరం కూడా చాలా ఉంది.