Poetry

అడగకండి బాబూ!

-రాంషా

అభ్యుదయ పత్రిక జనవరి 1956

అడగకురా, ప్రియసఖుడా! ఆదర పూర్వక వాక్కుల
అయ్యో ఓరయ్యో, నే చెప్పలేను భయ్యా!
ఇది సృజించె కల్లోలం, నా నిర్మల హృదయంలో
ఇది విధించె ప్రావాసం,
ఇష్టుల ఆప్తులనుండి.
విధి విధాత విడ్డురముగ విధించెనో నా నుదుటను
ఈ రహస్య వేదనయే రగుల్కొనెడు నా యెడంద;
తీర మింత కనిపించని సంద్రమురా నా చుట్టూ
తెడ్డు విరిగి ఒడ్డెరుగని జీవనౌక, ఆకట్టు.
నేను వినే, నేను కనే, నేను కలియు అన్నింటా
అన్నింటా ఒకే విసుగు ఒకే కసరు అన్నింటా
ఏ సుందర దృశ్యమైన అందదురా నా ముందర
ఆలి కంటి మెరుపుల్లో అయిపురాదు ఆనందం
దేని కింత దుఃఖమ్మని అడగకురా ప్రియసఖుడా!
జూలిపడకు నా తండ్రీ! ఎందు కంత సాహసమ్ము?
గుండె విచ్చి చూడు అదే నరక జ్వాలల కూపం!
అయ్యో, ఓరయ్యో, నే చెప్పలేను భయ్యా!
ఇంటి మీద కోపం, ఇల్లాలి మీద కోపం
వంటి మీద కోపం, నా బంటుమీదె కోపం
ఎందుకిదని యోచిస్తే కనిపించదు కారణం
అయ్యో, ఓరయ్యో! నే నవ్వలేను భయ్యా,!
రోగాలకి ఇష్టుణ్ణి; రోషాలకి భృత్యుణ్ణి;
వంట లేదు; పొయ్యికింద మంట లేదు;
పర్సున కానీ లేదు; కలతకు లోపం రాదు;
చెప్పగ మాటే రాదు; స్నేహితు ఓదార్పు లేదు.
దేని కింత దుఃఖమ్మని అడగకురా ప్రియసఖుడా !
అయ్యో ఓరయ్యో, నే చెప్పలేను భయ్యా!
అయ్యో ఓరయ్యో, నే చెప్పలేను భయ్యా!
నే చెప్పలేను భయ్యా !