Poetry

అరుణతార పొడిచింది

శ్రీ రాంషా.

అభ్యుదయ పత్రిక నవంబర్ 1946.

బోయీల్‌ మోసే పూలపల్లకీ!
కూలీల్‌ కట్టిన రాజభవపనమా!
రాజులు ఎక్కే సింహాసనమా!
న్యాయం చెప్పే మునసబులారా!
స్వేచ్ఛను అణచే జైలధికారీ!
గుర్తించండోయ్‌ గుర్తించండి;

మీ బధిరాంధక అధికారంలో
అడుగున నలిగీ, ప్రక్కకు అణిగీ
రోదించే ఆ బానిసజీవుల
ఆక్రందన ఆర్తరావం
గుర్తించండోయ్‌ గుర్తించండి.

మీ బధిరాంధక అధికారంలో
స్వార్ధంతో చేసిన మీ ద్రోహం
అణచిందీ అమాయకుల్ని .
రాచఱికం నాదేనంటూ
తలపోసే సైనిక ఖడ్గాల్‌
స్వతంత్రమే నాదేనంటూ
బంధించే ఇనుప గొలుసులూ,
అధికారం నాదేనంటూ
ఉరివేసే దండననీతీ,
మహరాజుల భూషణమ౦టూ
సామాన్యుని పీల్చే తురాయి
కొరడాలు, తుపాకిగుండ్లూ
ఇవ్వన్నీ రాజరికాలా ?
–ఇవ్వన్నీ ఇకపై నిలవవు.

సామాన్యుని వ్రతీకారమిక
ప్రజ్వలమై జ్వాలల చిమ్మీ
అధికారుల నిరోధకశక్తులు
తక్షణమే మారణహోమం
తక్షణమేమారణహోమం
చేస్తాయని గుర్తించండి.

ఎన్నెన్నో నామాల్‌ రూపాల్‌
ధరియించెను రాక్షసతత్వం
చీకటియై, పిశాచగణమై,
ఫాసిజమై, సామ్రాజ్యమ్మై
చెలరేగుట లింక భరింపం.
సామ్రాట్టుల దౌర్జన్యాలను
దూషించును దెవుడు, నరుడు!
బానిసలై కటకటలాడే
జాతులకే నెత్తురు పొంగెను;
చిరకాలపు తీరని కోరిక
నిరాశతో గుండెలు చీల్చెను.
కరుణించిన మానవ ప్రేమలు
భరియింపక నేల కూలినవి!
రెపరెపమండీ కరుణ కాలినది.
కన్నీరిక కార్చం వాటికి
రాకాసికి దండం పెడుతూ
స్తుతిచేస్తూకూచోం ఇకపై
గర్హించిన తళుకుల నిదిగో
పూజించిన దయ్యాన్నిపుడే
తక్షణమే హోమం చేస్తాం.